Telugu Gateway
Latest News

శాంసంగ్ 8కె టీవీలొచ్చేశాయ్..ధర ఎంతో తెలుసా?

శాంసంగ్ 8కె టీవీలొచ్చేశాయ్..ధర ఎంతో తెలుసా?
X

టీవీ ఏంటి?. అరవై లక్షల రూపాయలు ఏంటి అనుకుంటున్నారా?. అవి 8కె టీవీలు మరి. అయితే ఇదేదో సామాన్యులు..మధ్య తరగతి ప్రజల కోసం తయారు చేసేవి కావు. అత్యంత సంపన్నుల కోసం తయారు చేస్తున్న టీవీలు. ఈ టీవీల్లో చూస్తుంటే థియేటర్ లో కూర్చుని సినిమా చూసినట్లే ఉంటుంది. 4కె ఫిక్చర్ క్లారిటీ కంటే రెట్టింపు స్పష్టతతో ప్రముఖ తయారీ సంస్థ శాంసంగ్ ఈ 8కె టీవీలను అందుబాటులోకి తెచ్చింది. అత్యాదునిక సౌకర్యాలతో..ఆదునిక టెక్నాలజీతో శాంసంగ్ కొత్త టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళవారం నాడే ఇవి మార్కెట్లోకి వచ్చాయి. అ‍ల్ట్రా ప్రీమియం క్యూఎల్‌ఈడీ 8కె టీవీపేరుతో ఈ స్మార్ట్‌ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 59.99 లక్షల మధ్య ఉండనున్నాయి. పూర్తి హెచ్‌డీ తెరలతో పోలిస్తే 33 మిలియన్స్‌ పిక్సెల్స్‌ తో 16 రెట్ల స్పష్టత, క్లారిటీ వుంటుందని కంపెనీ చెబుతోంది.

బిగ్‌ స్క్రీన్ల కు పెరుగుతున్న ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత స్పష్టత కలిగిన క్యూఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటమ్‌ ప్రాసెసర్‌తో పనిచేసే 8కే రిజల్యూషన్‌ కలిగిన ఎల్‌ఈడీ టీవీలను తీసుకొచ్చింది. 75 అంగుళాల క్యూఎల్‌ఈడీ 8కే టీవీ ధర 10.99,900 రూపాయలు కాగా, 82 అంగుళాల క్యూఎల్‌ఈడీ 8కే ధర 16,99,990 రూపాయలు, 98 అంగుళాల క్యూఎల్‌ఈడీ 8కే టీవీ ధర .59, 99 900రూపాయలుగా నిర్ణయించింది. అయితే ముందస్తు ఆర్డర్లపై మాత్రమే 98 అంగుళాల టీవీలను తయారు చేస్తామని తెలిపింది. అలాగే 65 అంగుళాల టీవీ ధరను త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది. విలాసవంత గృహాలకు తగిన విధంగా క్యూఎల్‌ఈడీ టీవీలను విడుదల చేస్తున్నామని శాంసంగ్ చెబుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4కే యూహెచ్‌డీ తెరలతో పోలిస్తే 4 రెట్లు స్పష్టత ఉంటుంది. అలాగే టీవీల మార్కెట్‌లో శాంసంగ్‌ వాటా 30 శాతంగా ఉందనీ, , వచ్చే పండుగల సీజన్‌ (అక్టోబరు-నవంబరు)కు దీన్ని 34 శాతానికి పెంచుకోవాలనేది లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story
Share it