Telugu Gateway
Andhra Pradesh

‘జగన్మోహన్ రెడ్డి అనే నేను...’ కల నెరవేరింది

‘జగన్మోహన్ రెడ్డి అనే నేను...’ కల నెరవేరింది
X

సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కోరుకున్న స్వప్నం సాకారం అయింది. వైసీపీ శ్రేణులు ఎప్పుడప్పుడా అని కోరుకున్న ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను’ అనే మాట జగన్ నోట నుంచి వెలువడింది. అంతే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఒకటే కోలాహలం. సీఎం..సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు విన్పించాయి. ప్రమాణ స్వీకారంతో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారు. గవర్నర్ నరసింహన్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కెసీఆర్, డీఎంకె అధినేత స్టాలిన్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. గురువారం ఉదయం నుంచే ఇందిరా గాంధీ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు...కార్యకర్తలు..ఎమ్మెల్యేలు..ఎంపీలు, పార్టీ నేతలు తరలి వచ్చారు. అందరి సమక్షంలో జగన్ ప్రమాణ స్వీకారం సాగింది. గురువారం మధ్యాహ్నం 12:24 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పీవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్‌ జగన్‌ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 11.54 నిమిషాలకు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి విజయవాడకు బయలుదేరివచ్చారు. ఆయన వెంట వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల, అనిల్‌ సభా ప్రాంగణానికి వచ్చారు.

Next Story
Share it