Telugu Gateway
Latest News

బిగ్ బ్రేకింగ్..ఆగిపోయిన జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు!

బిగ్ బ్రేకింగ్..ఆగిపోయిన జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు!
X

మరో దేశీయ ఎయిర్ లైన్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ వేస్ తాత్కాలికంగా మూత పడింది. ఇది మళ్ళీ ఎగరటం ప్రారంభిస్తుందా? లేదా అన్నది కాలమే తేల్చాలి. దేశీయ విమానయాన రంగంలో ఎంతో పేరుగాంచిన జెట్ ఎయిర్ వేస్ బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయనుంది. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు ఎగిరేది మాత్రమే చివరి విమానం కానుంది. రుణదాతలు అదనంగా ఎలాంటి ఆర్ధిక సాయం చేయటానికి ముందుకు రాకపోవటంతో జెట్ మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్లు అయింది. ప్రస్తుత కార్యకలాపాలను సాఫీగా నడిపేందుకు 400 కోట్ల రూపాయలు సమకూర్చాల్సిందిగా నిర్వాహకుల ప్రతిపాదనకు బ్యాంకులు నో చెప్పాయి.

దీంతో ఎయిర్ లైన్స్ మూసివేత అనివార్యం అయింది. గతంలో దేశీయ విమానయాన రంగంలో ఓ వెలుగు వెలిగిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా ఆర్థిక కష్టాల్లో పడి మూత పడిన విషయం తెలిసిందే. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభంతో అత్యంత కీలకమైన పైలెట్లు కూడా తమ దారి తాము చూసుకుంటూ ఉద్యోగాలు మారుతున్న విషయం తెలిసిందే. దేశీయ విమానయాన రంగంలో చెప్పుకోదగ్గ మార్కెట్ వాటా కలిగిన ఎయిర్ లైన్స్ మూతపడటంతో రాబోయే రోజుల్లో విమాన టిక్కెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. అయితే ఇఫ్పటికే జెట్ ఎయిర్ వేస్ విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడాల్సిందే.

Next Story
Share it