గోవా స్టార్ హోటల్ లో యువతి హత్య

నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవాలో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టార్ హోటల్‌లో పాతికేళ్ల యువతి దారుణ హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆల్కా సైనిగా గుర్తించారు. ఈనెల 20న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అర్పోరా బీచ్ విలేజ్‌లోని హోటల్‌లో ఆమె దిగారని, అయితే బాయ్‌ఫ్రెండ్ కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. ఆమె గదిలోకి వెళ్లిన హోటల్ మెయింటెనెన్స్ సిబ్బందికి యువతి విగతజీవిగా కనిపించిందని, ఆమె మెడపై కత్తి గాట్లు ఉన్నాయని గుర్తించామని పోలీసులు తెలిపారు.
పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని పనాజీ సమీపంలోని గోవా మెడికల్ కాలేజ్‌కు తరలించారు. బాధితురాలి మృతదేహాన్ని గుర్తించే ముందు రూమ్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని బాయ్‌ఫ్రెండ్ హతామార్చాడా లేక దుండగుల పనా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.