Telugu Gateway
Latest News

కొలంబోలో పేలుళ్ళు..భారీగా ప్రాణ నష్టం

కొలంబోలో పేలుళ్ళు..భారీగా ప్రాణ నష్టం
X

మూడు కీలక చర్చిలు. మూడు స్టార్ హోటళ్లు. ఈస్టర్ ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు చేసిన పేలుళ్ళ విధ్వంసంతో శ్రీలంక రాజధాని కొలంబో ఆదివారం ఉదయం దద్దరిల్లింది. ఈ పేలుళ్ళకు ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఏకంగా 185 మంది మృతిచెందగా, 300మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది.

షాంగ్రి లా హోటల్‌, కింగ్స్‌ బరీ హోటల్‌లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ పేలుళ్ళు చోటుచేసుకున్నట్లు సమాచారం. కొలంబోకు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తారు. బాంబు పేలుళ్ళ వార్తలతో పర్యాటకులు కూడా భయాందోళనలకు గురవున్నారు.

Next Story
Share it