Telugu Gateway
Politics

మీరు మంత్రులు కాదు..ఎమ్మెల్యేలే పోయి ఫిర్యాదులు చేయండి!

మీరు మంత్రులు కాదు..ఎమ్మెల్యేలే పోయి ఫిర్యాదులు చేయండి!
X

ఈ మాట అన్నది ఎవరో తెలుసా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఆగ్రహాంతో ఊగిపోతూ మంత్రులపై మండిపడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు సమావేశంలోనూ అన్నీ తానే చూసుకోవాల్సి వస్తోందని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతో పాటు ఏ విషయంలోనూ మంత్రులు సరైన పనితీరు చూపించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరేదో మేం మంత్రులం’ అని కూర్చుంటే నడవదు అని..నేరుగా వెళ్ళి ఫిర్యాదులు చేయాల్సిందే అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటంతో చేసేదేమీ లేక మంత్రులు కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు, నారాయణ, ఆనంద్ బాబు, అమర్నాధ్ రెడ్డి, ఫరూఖ్, సుజయకృష్ణ రంగారావులు వెంటనే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి దగ్గరకు వెళ్ళి వైసీపీపై ఫిర్యాదు చేశారు.

బుధవారం నాడు కూడా తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేయటానికి కూడా గుంటూరు రూరల్ ఎస్పీ వద్దకు మంత్రులు కళా వెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు, పార్టీ నేతలు వెళ్ళారు. సహజంగా ఒకప్పుడు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసేవి..అధికార పార్టీలు సమాధానాలు చెప్పేవి. ఇప్పుడు అంతా సీన్ రివర్స్ అయినట్లు కన్పిస్తోంది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నిత్యం ఏదో ఒక ధర్నాలు..దీక్షలు అంటూ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు మంత్రులకు కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు. మంత్రులం కదా కూర్చుని పెత్తనం చేస్తామంటే కుదరదు అని..నేరుగా రంగంలోకి దిగాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించటంతో అవాక్కు అవటం వారి వంతు అయింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు తీరు చూసి మంత్రులు కొంత మంది షాక్ కు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it