Telugu Gateway
Latest News

పది శాతానికే పరిమితం దేశీయ విమానయాన వృద్ధిరేటు

పది శాతానికే పరిమితం దేశీయ విమానయాన వృద్ధిరేటు
X

కొత్త సంవత్సరం విమానయాన రంగానికి గడ్డుకాలం కాబోతుందా?. 2019 జనవరి గణాంకాలు చూస్తే ఇదే అనుమానం వస్తోంది. గత ఏడాదిలో ప్రతి నెలా సగటున 20 శాతం వృద్ధి రేటు సాధించిన దేశీయ విమానయాన రంగం 2019 జనవరి నెలలో మాత్రం 9.10 శాతం వృద్ధి రేటుకే పరిమితం అయింది. 2018 జనవరి నుంచి డిసెంబర్ వరకూ ప్రతి నెలా ప్రయాణికుల వృద్ధి రేటు 19 నుంచి 20 శాతం పైనే ఉంది. అయితే 2019 జనవరిలో మాత్రం అది సగానికి సగం తగ్గింది. 2019 జనవరిలో దేశంలోని ఎయిర్ లైన్స్ ద్వారా 1.25 కోట్ల మంది ప్రయాణించారు. 2018 జనవరిలో నెలలో ఈ మొత్తం 1.14 కోట్లుగా ఉంది.

2018 డిసెంబర్ తో 2019 జనవరిలో అన్ని ప్రముఖ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గుముఖం పట్టింది. పర్యాటకుల సీజన్ ముగియటం వల్లే ఈ తగ్గుదల నమోదు అయినట్లు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 92.7 శాతం ఉన్న స్పైస్ జెట్ ఆక్యుపెన్సీ రేషియో 2019 జనవరిలో 90.9 శాతానికి తగ్గుముఖం పట్టింది. ఇండిగో ఆక్యుపెన్సీ రేషియో కూడా 88.9 నుంచి 86.4 శాతానికి, ఎయిర్ ఇండియా ఆక్యుపెన్సీ రేషియో 81.2 శాతం నుంచి 80 శాతానికి పరిమితం అయింది.

Next Story
Share it