Telugu Gateway
Politics

మంత్రులపై చంద్రబాబుకు ఇప్పుడు జ్ణానోదయం అయిందా?

మంత్రులపై చంద్రబాబుకు ఇప్పుడు జ్ణానోదయం అయిందా?
X

అమెరికా అధ్యక్షుడి నుంచి అందరిపై విమర్శలకూ వాళ్ళే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అంతర్జాతీయ అంశాలపై కూడా తెలుగుదేశం పార్టీలో స్పందించేది వాళ్ళే. జాతీయ అంశాలైనా..ప్రాంతీయ అంశాలైనా వాళ్ళే తెర మీదకు వస్తారు. సీనియర్ నేతలు కానీ..సీనియర్ మంత్రులు కూడా అసలు ముందుకు రారు. మాట్లాడే వాళ్ళకు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉండగా ‘ఫైటర్స్’గా పేరుగాంచిన వారిని పక్కన పెట్టేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఫైటర్స్ ను వదిలేసి.. వేరే ‘అంశాల’కు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా ఫిరాయింపుదారులు..కొంత మంది ‘పైరవీలు’ చేసుకునే వారికి ఇలా రకరకాల కారణాలతో నచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఐదేళ్ళ పాలన పూర్తయ్యే దశలో, ఎన్నికల ముందు మంత్రులు స్పందించటం లేదని ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు జ్ణానోదయం అయిందా? అన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి. సోమవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబునాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఏ విషయంలో అయినా విపక్షాల విమర్శలకు తానే స్పందించాల్సి వస్తుందని...మంత్రులు అసలు పట్టించుకోవటంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ‘ఎవరి పనిలో’ వారు బిజీగా ఉండిపోయారు. ఎన్నికల సమయంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయం గుర్తుకురావటం విచిత్రం. గత కొంత కాలంగా పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలు..విపక్షాలపై విమర్శలు చేసే బాధ్యతను అదేదో కాంట్రాక్ట్ కు ఇఛ్చినట్లు బుద్ధా వెంకన్న, వి బి రాజేంద్రప్రసాద్, బొండా ఉమాలు మాత్రమే సీన్ లోకి వచ్చేశారు. అప్పుడప్పుడు మంత్రులు అలా మెరిసి మాయం అయిపోయేవారు. గత కొంత కాలంగా బోండా ఉమ, రాజేంద్రప్రసాద్ లు కూడా ఎందుకో సైలంట్ అయిపోయారు. ప్రస్తుతం బుద్ధా వెంకన్న ఒక్కరే ఇంకా ‘రైజింగ్ స్టార్’గా మిగిలారు.

ఎంతటి కీలక అంశం వచ్చినా సరే సీనియర్ మంత్రులు మొదలుకుని..జూనియర్ల వరకూ ‘మనకెందుకులే. మన ‘పని’ మనం చేసుకుందాం’ అనే మూడ్ లోకి వెళ్ళిపోయారు. లేదా స్వయంగా చంద్రబాబో..లేదా ఆయన కార్యాలయం రంగంలోకి దిగి ఎవరిపై అయినా ‘ఎటాక్’ చేయమంటే చేస్తారు. లేదంటే లేదు. చాలా మంది మంత్రులు చేతిలో అధికారం ఉండగా ఈ ఖండనలు..విమర్శలు మనకెందుకు అన్నట్లు వదిలేస్తారు. దీంతో ఎంపిక చేసిన కొంత మంది నేతలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అనకాపల్లి అంశం వరకూ వాళ్లే స్పందిస్తారు. మరి ఈ విషయాన్ని చంద్రబాబు ఇంత త్వరగా ఎలా గుర్తించారో.

Next Story
Share it