ఏపీ రైతులకు పది వేలు
ఎన్నికల ముందు మరో రైతు పథకం. అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీలోని రైతులకు ఏటా పది వేల రూపాయలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అయితే కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చే ఏటా ఆరు వేల రూపాయలకు కలిపి..రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేలు జత చేసి మొత్తం పది వేల రూపాయలు ఇవ్వనుంది. కేంద్రం స్కీమ్ పరిధిలోకి రాని వారు ఏపీ సర్కారే నేరుగా పది వేల రూపాయలు చెల్లించనుంది. భూమి సొంతదారులకే కాకుండా..కౌలురైతులకు కూడా తాము ఈ స్కీమ్ కింద సాయం అందజేస్తున్నామని..ఇది తెలంగాణలోనే కాదు...దేశంలో ఎక్కడాలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ఫిబ్రవరి నెలాఖరు నాటికే ఈ నిధులు రైతు ఖాతాలకు చేరతాయని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్ లో 5000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల స్థలం...గజం రూ.4వేల చొప్పున 2390 ఎకరాలు కేటాయింపుకు బుధవారం నాడు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో సమావేశం ఆమోదం తెలిపింది. జర్నలిస్టులకు 30 ఎకరాల భూమి (ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు) కేటాయించింది. తొలివిడత సీఆర్డీఏకు రూ.కోటి చెల్లిస్తే సొసైటీకి భూమి కేటాయింపు చేస్తారు. మిగతా మొత్తం రెండేళ్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది.