Telugu Gateway
Latest News

దేశీయ గ‌గ‌న‌తలంలో డ‌బుల్ డెక్క‌ర్ విమానాలు

దేశీయ గ‌గ‌న‌తలంలో డ‌బుల్ డెక్క‌ర్ విమానాలు
X

ప్ర‌స్తుతం దేశంలో ముంబ‌య్, డిల్లీ వంటి ప్రాంతాల నుంచే దుబాయ్, సింగ‌పూర్ వంటి విదేశీ రూట్లలో డ‌బుల్ డెక్క‌ర్ విమానాలు న‌డుస్తున్నాయి. తొలి సారి దేశీయ రూట్ లో కూడా ఈ డ‌బుల్ డెక్క‌ర్ విమాన ప్ర‌యాణం దేశీయ ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానుంది. ఈ సేవ‌ల‌ను తెస్తున్న‌ది ప్ర‌భుత్వం రంగంలోని ఎయిర్ ఇండియా కావ‌టం విశేషం. అత్యంత ర‌ద్దీ ఉండే ప్రాంతాల్లో ఈ విమానాల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. డిల్లీ-ముంబ‌య్-కోల్ క‌తా మార్గాల్లో ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. బోయింగ్ 747 ఎయిర్ ఇండియా డ‌బుల్ డెక్క‌ర్ విమానంలో మొత్తం 423 సీట్లు ఉంటాయి. అందులో బిజినెస్ క్లాస్ కు 26, ఫ‌స్ట్ క్లాస్ కు 12, ఎకాన‌మీకి 385 సీట్లు కేటాయించారు.

ఈ నెల 16 నుంచే దేశీయ గ‌గ‌న‌తలంలో డ‌బుల్ డెక్క‌ర్ విమానాలు చ‌క్క‌ర్లు కొట్ట‌నున్నాయి. అక్టోబ‌ర్ 16 నుంచి 21 వ‌ర‌కూ ఢిల్లీ-కోల్ క‌తా మార్గంలో ఈ విమాన స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. త‌ర్వాత ముంబ‌య్ కు విస్త‌రించారు. కేవ‌లం అంత‌ర్జాతీయ రూట్ల‌కే మాత్ర‌మే ఉప‌యోగించే ఈ నాలుగు ఇంజ‌న్ల విమానాలు తొలిసారి దేశీయ రూట్ల‌లో ప్ర‌యాణించ‌నున్నాయి. పండుగల సీజ‌న్ లో ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌ట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి. డ‌బుల్ డెక్క‌ర్ విమానం ఎక్కాల‌నే కోరిక ఉన్న వారికి దేశీయ రూట్లలోనే ఈ క‌ల నేర‌వేర‌నుంది.

Next Story
Share it