మరో సారి పెరిగిన వడ్డీరేట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. తాజా నిర్ణయంతో పలు రకాల రుణాలపై సామాన్యుల నుంచి మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. చాలా కాలం వడ్డీ రేట్లను ఏ మాత్రం టచ్ చేయని గత రెండు సమీక్షల్లో మాత్రం పెంపు నిర్ణయం తీసుకుంటూ పోతోంది. ఎవరూ ఊహించని రీతిలో ఆర్ బిఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది సమీక్షలో యధాతధ స్థితిని కొనసాగిస్తుందని భావించారు. ఆర్ బిఐ తాజా నిర్ణయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. బుధవారం నాటి సమీక్షలో ఆర్ బిఐ కీలక వడ్డీరేటు రెపోను వరుసగా రెండోసారి 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతం పెరిగింది. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ఖరీప్ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వంటి అంశాల కారణంతో వడ్డీ రేట్లు పెంచేందుకే మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల సమావేశం అనంతరం ఆర్‌బీఐ నేడు(బుధవారం) ఈ పాలసీ నిర్ణయాన్ని ప్రకటించింది. గత జూన్ పాలసీలో కూడా రెపోను 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.