Telugu Gateway
Latest News

ఇక సెలవు..అంటూ వెళ్లిపోయిన మహానేత

ఇక సెలవు..అంటూ వెళ్లిపోయిన మహానేత
X

దేశమంతా రోదించింది. అది టీవీల్లో ..పత్రికల్లో కన్పించేది కాదు. మహానేత వాజ్ పేయి మరణం తర్వాత అందరూ మౌనంగా రోదించారు. ఓ మహానేతను కోల్పోయామని మనసులోనే నివాళులు అర్పించారు. ఎందుకంటే వాజ్ పేయి అంటే అంత అభిమానం. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నేత ఆయన. భారత్ అంటే నిత్యం కుట్రలు..కుతంత్రాలు చేసే పాకిస్థాన్ లోనూ వాజ్ పేయికి అభిమానులు ఉన్నారంటే ఆయన మంచితనం అర్థం చేసుకోవచ్చు. భారత దేశ రాజకీయాల్లో ఇక ఇప్పట్లో వాజ్ పేయి తరహా నేతను చూడటం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం దేశ ప్రజల అశ్రునయనాల మధ్య మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమ సంస్కారాలు ముగిశాయి. యమునా నది తీరంలోని స్మృతి స్థల్‌లో ఆయన ఇక శాశ్వతంగా సేద తీరారు. అశేష జనవాహిని, బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి.

ప్రభుత్వ అధికార లాంఛనాలతో, హిందూ సంప్రదాయం ప్రకారం మంత్రోచ్ఛారణల మధ్య కర్మయోగి అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అనంతరం త్రివిధ దళాల అధిపతులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్మృతిస్థల్‌ ప్రాంగణమంతా అటల్‌జీ అమర్‌ రహే నినాదాలు మిన్నంటాయి. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి మోదీ, అమిత్‌ షా, అద్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు వాజ్‌పేయికి శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ దేశాల నేతలు, విదేశాంగ మంత్రులు వాజ్‌పేయి పార్థివదేహంపై పుష‍్ప గుచ్ఛాలుంచి తుది వీడ్కోలు పలికారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయం నుంచి సాగిన అంతిమ యాత్ర ఆసాంతం ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు పాల్గొన్నారు.

Next Story
Share it