Telugu Gateway
Andhra Pradesh

దూకుడు పెంచిన ఏపీ బిజెపి

దూకుడు పెంచిన ఏపీ బిజెపి
X

చాలా గ్యాప్ తర్వాత ఏపీ బిజెపి దూకుడు పెంచింది. కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి విజయవాడలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అవినీతి చర్యలు, మోడీపై విమర్శలకు వ్యతిరేకంగా బిజెపి ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. కేంద్ర నిధులను ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఓ సారి వాజ్ పేయిని చంద్రబాబు మోసం చేసినా మోడీ నమ్మారని అన్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబుతో కలసి పనిచేయటం తమ ఖర్మ అన్నారు. సమస్యను పక్కదారి పట్టించి రాజకీయం చేయటంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

అన్నం పెట్టిన చేతిని నరకటం చంద్రబాబుకు అలవాటన్నారు. గతంలో ఈ సంగతి ఎన్నోసార్లు నిరూపితం అయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తుంటే చంద్రబాబు ఆ డబ్బులతో ప్రాజెక్టు పనులు చేస్తూనే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ఎంతసేపూ రాజకీయం తప్ప మరొకటి లేదన్నారు. వైసీపీ, పవన్ కళ్యాణ్ కలసి పోతున్నారని..వారిద్దరి మధ్య అక్రమ సంబంధాలు అంటగట్టడం, వీరి వెనక బిజెపి ఉందని దుష్ప్రచారం చేయటం తప్ప..చంద్రబాబు పరిపాలన ఏమీ చేయటం లేదని ధ్వజమెత్తారు

Next Story
Share it