Telugu Gateway
Andhra Pradesh

‘భవిష్యత్ దర్శనం’లో చంద్రబాబు!

‘భవిష్యత్ దర్శనం’లో చంద్రబాబు!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ‘భవిష్యత్’ కళ్ళ ముందు కనపడుతుందా?. అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. సీబీఐ ఇంకా ఆపరేషన్ మొదలుపెట్టక ముందే ఆయనలో టెన్షన్ మొదలైంది. తనను..లోకేష్ ను, మంత్రులను టార్గెట్ చేసే అవకాశం ఉందని స్వయంగా చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ లో ప్రకటించటం పార్టీలో కలకలం రేపుతోంది. ముందు జాగ్రత్త చర్యగానే చంద్రబాబు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ‘సానుభూతి’ రాజకీయం చేసేందుకు రెడీ అయిపోయినట్లు కన్పిస్తోంది. అందుకే రోజూ సింగిల్ పాయింట్ ఏజెండా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. బిజెపి, జనసేన, వైసీపీ కుమ్మక్కు అయ్యాయని. పదిహేను రోజుల క్రితం వరకూ ఇదే టీడీపీ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం ప్రజలు మర్చిపోతారా?. కేంద్రంలోని బిజెపి ఆకస్మాత్తుగా ఇప్పుడు సీబీఐ కేసులు పెట్టినా..లేక ఇతర చర్యలు ఏమి మొదలుపెట్టినా కక్ష సాధింపు చర్యల్లో భాగం అనే విమర్శలు వెల్లువెత్తటం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నిజంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు ఎవరూ ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే..అక్రమాలు చేయకపోతే సీబీఐ కాదు కదా? ఏ ఏజెన్సీ విచారణకు అయినా ఎందుకు భయపడాలి.

ఆ అవసరం ఏముంటుంది. రాష్ట్రం కోసం మోడీతో ఢీకొట్టానని చెప్పుకునే చంద్రబాబు కేసులకు భయపడాల్సిన అవసరం ఉందా?. అది పట్టిసీమ కావచ్చు...పోలవరం కావచ్చు...అమరావతి స్విస్ ఛాలెంజ్ కుంభకోణం కావచ్చు...సోలార్ పవర్ విద్యుత్ కొనుగోళ్ళు..వైజాగ్ భూముల స్కామ్ కావచ్చు. నిప్పులా..నిజాయతీతో నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు సీబీఐ విచారణకో..మరో విచారణకో భయపడాల్సిన అవసరం ఏముంది?. లోకేష్ ను, తనను, మంత్రులను టార్గెట్ చేస్తారని బెంబేలెత్తాల్సిన అవసరం ఏముంది?. అంటే ఎక్కడ ఏమి చేశారో...ఎక్కడ ఎన్ని వందల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందో...ఎక్కడి నుంచి ఎక్కడికి నిధులు వెళ్ళాయో స్కామ్ లు చేసినోళ్లకు తప్ప..మిగిలిన వాళ్ళకు తెలియవు కదా?. అయితే మోడీ సర్కారు అందరి తరహాలోనే చంద్రబాబుపై సీబీఐని సాదాసీదాగా ఉసిగొల్పితే కుదరదు అని...ఆయన్ను ఎదుర్కొనేందుకు ‘ప్రత్యేక పద్దతులు’ పాటించాల్సిన అవసరం ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. లేదంటే మీడియాను అడ్డం పెట్టుకుని ‘సానుభూతి’ రాజకీయాలు చేసి..వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఇప్పటికే స్కెచ్ వేశారని..బిజెపి ఆ విషయాన్ని గ్రహించి ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it