Telugu Gateway
Latest News

ఫ్లోరిడా స్కూల్ లో కాల్పులు..17 మంది మృతి

ఫ్లోరిడా స్కూల్ లో కాల్పులు..17 మంది మృతి
X

అమెరికాలో మరోసారి కాల్పుల ఘాతుకం. ఓ విద్యార్ధి ఏకంగా 17 మంది విద్యార్ధులను పొట్టనబెట్టుకున్నాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏ తప్పు చేయని యువతీ, యువకులు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ ల్యాండ్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్‌ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో పాఠశాలలోని వారంతా భయంతో పరుగులు తీశారు. పార్క్‌ ల్యాండ్‌లోని మార్జోయ్‌ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో బుధవారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగాయి. దుండగుడు లోపలికి వస్తూనే గేటు దగ్గర ముగ్గురిని కాల్చి చంపాడు. ఆ వెంటనే బిల్డింగ్‌ ఫైర్‌ అలారంను మోగించాడు. ఆ శబ్ధానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా ఒక్కసారిగా బయటికి వచ్చేప్రయత్నం చేశారు.

అప్పుడా దుండగుడు ద్వారానికి ఎదురుగా నిలబడి.. బయటికి వచ్చినవారిని వచ్చినట్లు కాల్చేశాడు. ప్రాధమిక సమాచారం ప్రకారం కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. డగ్లస్‌ స్కూల్లో కాల్పులకు పాల్పడిన టీనేజర్‌ను నికోలస్‌ క్రూజ్‌(19)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నికోలస్‌ కూడా అదే స్కూల్‌ విద్యార్థి అని, కొద్ది రోజుల కిందటే అతను సస్పెండ్‌ అయ్యాడని వెల్లడించారు. కాల్పుల అనంతరం స్కూల్లోనే నక్కిఉన్న నికోలస్‌ను పోలీసులు బంధించారు. సస్పెండ్‌ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం.

Next Story
Share it