విజయవాడలో విషాదం
ప్రకృతి అందాలు చూడాలన్న వారి సరదా..శాశ్వతంగా తమ జీవితాలకు ముగింపు అవువుందని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. కార్తీక మాసం సందర్భంగా సరదాగా..అలా ఇలా తిరిగొద్దామని వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఏకంగా 20 మంది మృత్యువాతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా వారుకాగా..కొంత మంది నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. పవిత్ర సంగమం ప్రాంతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణం జరిగిన సంఘటనలు లేవు. కానీ పర్యాటక శాఖ నిర్లక్ష్యం కారణంతో పడవ బోల్తాపడి ఒకేసారి 17 మంది చనిపోయారు. ఈ ఘటనతో బంధువుల రోదనలు స్థానికుల్ని కంటతడి పెట్టించాయి. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చలికాలం కావడంతో సాయంత్రం 5.30 గంటలకే వెలుతురు తగ్గి చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నదిలో మునిగిపోయిన వారిని వెతకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్ వెలుగులో గజ ఈతగాళ్లు అర్ధరాత్రి వరకు గాలించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి నదిలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేసింది. రాత్రి 8.30 గంటల వరకూ బాధితులు అక్కడే వేచి చూసి తమ వారి సమాచారం తెలుస్తుందేమోనని ఆశతో ఎదురుచూశారు.మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ అక్రమ బోట్ల దందాలో ఇద్దరు మంత్రులతోపాటు..పర్యాటక శాఖకు చెందిన కొంత మంది అధికారుల అక్రమార్జన కూడా కారణంగా ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.