Telugu Gateway
Politics

తెలంగాణ‌లో స‌మైక్య పాల‌న‌కు మించిన అవినీతి

తెలంగాణ‌లో స‌మైక్య పాల‌న‌కు మించిన అవినీతి
X

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం సమైక్య పాలకులను మించి అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయార‌న్నారు. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజ‌య్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారనడానికి దేశ చరిత్రతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అనేక సంఘటనలే నిదర్శనం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్, టీడీపీ పాలన కంటే తెలంగాణలోని కేసీఆర్ హయాంలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోంది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఈ పాలనకు చరమ గీతం పాడాలని భావిస్తున్నారని తెలిపారు.

బీజేపీకి నాయకులు ముఖ్యం కాదు. సిద్దాంతాలు ముఖ్యం. పార్టీకి లక్ష్యాలు, విధానాలు ముఖ్యం. నక్సలైట్ల నుండి చంపేస్తామంటూ వార్నింగులు వచ్చినా....కుటుంబాలకు దూరమై పార్టీ కోసం పనిచేసిన నాయకులెందరో బీజేపీలో ఉన్నారు. అలాంటి నాయకుల వల్లనే ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చే పరిస్థితి ఏర్పడింది. వారి స్పూర్తితోనే పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాటికి ఎంఐఎం కొమ్ముకాస్తోంది. అందుకే పాతబస్తీ అభివ్రుద్దికి దూరంగా ఉంది. ఈ విషయాన్ని పాతబస్తీ ప్రజలు కూడా గుర్తించారన్నారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. దేశద్రోహుల పార్టీని తరిమికొట్టే విషయంలో ఎన్నటికీ వెనుకాడం. దేశంలో హిందు సమాజం శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.

Next Story
Share it