Telugu Gateway
Top Stories

టపాకాయలు కాల్చినా..అమ్మినా లక్ష ఫైన్

టపాకాయలు కాల్చినా..అమ్మినా లక్ష ఫైన్
X

కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్రల్లో టపాసులపై నిషేధం

వెలువడని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నిర్ణయం

కరోనా మరో పండగను దూరం చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు వరస పెట్టి దీపావళి సందర్భంగా టపాసులు కాల్చటంపై నిషేధం విధిస్తున్నాయి. టపాసులు పేల్చటం ద్వారా వచ్చే కాలుష్యం కరోనా కేసులను మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించటంతో పలు రాష్ట్రాలు దీపావళిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే మరింత కఠిన నిబంధనలు విధించారు. ఇప్పటికే ఢిల్లీ కాలుష్యంతో, భారీ ఎత్తున పెరుగుతున్న కరోనా కేసులతో తీవ్రంగా సతమతం అవుతోంది. దీనికి దీపావళి కాలుష్యం తోడు అయితే మరింత ప్రమాదం అని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్)లో ఎక్కడైనా దీపావళి టపాసులు అమ్మినా..కాల్చినా లక్ష రూపాయల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం నాడు ప్రకటించారు. చివరకు గ్రీన్ క్రాకర్స్ ను కూడా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా దీపావళి టపాసులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో ఈ ఏడాది దీపావళి టపాసులను అనుమతించటంలేదని తెలిపారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు పలువురితో చర్చించినట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా టపాసులకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను కోరింది. వీటితోపాటు రాజస్థాన్, ఒడిశా, సిక్కింలు కూడా టపాసులు కాల్చటంపై నిషేధం విధించాయి. కలకత్తా హైకోర్టు కూడా టపాసులు కాల్చటంపై నిషేధం విధించింది. అయితే ఈ అంశంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది.

Next Story
Share it