గోవా టూర్..రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి
దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా ఈ సారి పర్యాటకుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయనుంది. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన పెట్టనుంది. వ్యాక్సినేషన్ పూర్తయిన వారినే అనుమతించటంతోపాటు ఆర్ టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ కూడా తప్పనిసరి చేయనున్నారు. గోవా మంత్రి మిఖైల్ లోబో వెల్లడించారు. పర్యాటకులను అనుమతించిన తర్వాత కనీసం తొలి మూడు నెలలు ఈ నిబంధన అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గోవాలో కేసులు తగ్గుముఖం పడుతున్నా తాము ఇంకా కొంత కాలం వేచిచూసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గోవాలో ప్రస్తుతం 2727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే నెల నుంచి పర్యాటకులను అనుమతించే అవకాశం ఉందని సమాచారం. అయితే కఠిన నిబంధనలు అమలు చేస్తూ పర్యాటకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కరోనా తొలి దశ కంటే రెండవ దశలో ఈ పర్యాటక ప్రాంతంలో అత్యధిక పాజివిటివి రేటు నమోదు అయి ఒకింత ఆందోళన కలగచేసింది. అయితే ఇప్పుడు కరోనా అదుపులోకి వచ్చింది.