ఇరాన్ ప్రజలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తలు మళ్ళీ పెరిగాయి. ఈ రెండు దేశాలు పరస్పరం పెద్ద ఎత్తున దాడులకు దిగటంతో స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అంతే మరో సారి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. తన వరకు ఇక శాంతి ఒప్పందం ముగిసినట్లే అంటూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తో చర్చలు టైం వేస్ట్ వ్యవహారం అన్నారు. బుధవారం ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురి అయ్యాయి. దీనికి ప్రధాన కారణం శాంతి ఒప్పందంపై డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే. ఈ ప్రకటన వచ్చిన తర్వాత అన్ని కీలక షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ లో బ్లడ్ బాత్ సాగింది. బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1677 పాయింట్లు నష్టపోయిన 76503 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ-50 సైతం 516.65 పాయింట్లు నష్టపోయి 23,882.05 వద్ద క్లోజ్ అయింది.ఈ పతనంతో కొన్ని గంటల్లోనే మదుపర్లు ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. దాదాపు అన్ని రంగాల్లో షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
ఇరాన్ పై తీవ్ర వ్యాఖ్యలు
ఒక వైపు ఇరాన్ తో శాంతి ఒప్పందం ముగిసిపోయింది అని చెపుతూనే మరో వైపు తమ వాళ్ళు మాత్రం చర్చ కొనసాగిద్దాం అంటున్నారు అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించటం విశేషం. అయినా వాళ్ళు మళ్ళీ తన దగ్గరకే రావాల్సి ఉంటుంది వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణలతో.. ఇరాన్‌కు చెందిన రేవు పట్టణాలైన బందర్ అబ్బాస్, సిరిక్, అలాగే కెస్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.మరోవైపు.. ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మినహాయింపు లైసెన్స్‌ను కూడా వాషింగ్టన్ రద్దు చేసింది. దీనికి ప్రతిచర్యగా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా లక్ష్యాలపై ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న రెండు రోజుల నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. కాల్పుల విరమణ స్థితిపై స్పందిస్తూ.. 'నా దృష్టిలో అయితే అంతా అయిపోయింది. ఇకపై వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు.
వారితో చర్చలు జరపడం కాలయాపన మాత్రమే. వారు నీచులు. నీచులు అంటే ఏంటో మీకు తెలుసా? మానసిక రోగులు. వారిని నడిపించే నాయకులు కూడా మానసిక రోగులే. వారు అత్యంత క్రూరులు, హింసాత్మక ప్రవృత్తి గలవారు. వారి చేతికి గనుక అణ్వాయుధం చిక్కితే, వారు కచ్చితంగా దానిని వాడేస్తారు. అందుకే నా పరంగా ఈ ఒప్పందం ముగిసిపోయింది' అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో చర్చలు కొనసాగించవచ్చని, అయితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనే దానిపై తనకు నమ్మకం లేదన్నారు. 'వారు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, కానీ వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను' అని ట్రంప్ స్పష్టం చేశారు.



