Telugu Gateway
Top Stories

ఎగిరే కార్లకు అమెరికా రైట్ రైట్

ఎగిరే కార్లకు అమెరికా రైట్ రైట్
X

ప్రపంచంలోనే తొలి ఎగిరే ఎలక్ట్రిక్ కారు కు అమెరికా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రోడ్లపై వెళ్లే కార్లకు పెద్దగా సమస్యలేమీ ఉండవు. కానీ ఎగిరే కారు అంటే దీనికి చాలానే లెక్కలు ఉంటాయి. అసలు ఈ కారు గాలిలో విమానంలాగా సురక్షితంగా ఎగరగలుగుతుందా...లేదా వంటి అంశాలను చూసి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. అమెరికా కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ ) అలెఫ్ అనే సంస్థ తయారు చేసిన ఎగిరే కారు కు ఎయిర్ వర్తినెస్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. అంటే ఈ కార్లు ఎగరడానికి అర్హమైనవి గా ఎఫ్ఏఏ అనుమతి మంజూరు చేసినట్లు లెక్క. ఈ కారు ఉన్న చోట నుంచే నిటారుగా గాలిలోకి ఎగురుతుంది. ఇందులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది.

అసలు ఆ కారు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమే కాలేదు. కానీ ఆర్డర్ లు మాత్రం వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే 440 కార్ల కు ఆర్డర్లు వచ్చాయి. ఈ కారు ధర మూడు లక్షల డాలర్లు. మన భారతీయ కరెన్సీలో అయితే సుమారు రెండున్నర కోట్ల రూపాయలు. కాలిఫోర్నియా లోని సాన్ మాటేమో కేంద్రంగా పనిచేసే అలెఫ్ ఏరోనాటిక్స్ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ను తయారు చేసింది. మాములు కార్లను ఎలా అయితే పార్క్ చేస్తున్నారో...అలాగే ఈ ఎలక్ట్రిక్ కారు ను పార్క్ చేయ వచ్చు కంపెనీ వెల్లడించింది. అయితే ఇది రోడ్ పై గంటకు 25 కిలోమీటర్ల వేగంలో మాత్రమే వెళ్లగలదు. అంతకు మించి స్పీడ్ కావాలంటే మాత్రం అప్పుడు గాలిలోకి ఎగిరే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్లు 2025 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి.

Next Story
Share it