Telugu Gateway
Top Stories

అమెరికాలో అలజడి సృష్టిస్తున్న ట్రంప్

అమెరికాలో అలజడి సృష్టిస్తున్న ట్రంప్
X

అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సిన సమయం ఆసన్నం అవుతున్న కొద్ది డొనాల్డ్ ట్రంప్ లో అసహనం హద్దులు మీరుతోంది. అందుకే ఆయన తన మద్దతుదారులతో పార్లమెంట్ భవనం వద్ద భారీ అల్లర్లకు కారణం అయ్యారు. ఈ పరిణామాలు అమెరికాలోని ప్రజాస్వామ్యవాదులను నిశ్చేష్టులను చేస్తున్నాయి. ఓటమి పాలైన దగ్గర నుంచి ట్రంప్ ది అదే వరస . ఎలాగైనా పదవిలో కొనసాగేందుకు తాను ఎంతవరకైనా వెళతానంటూ ఇటీవలే ట్వీట్ చేశారు. అన్నట్లుగా ఆందోళనలకు కారణం అవుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌ భవనం(పార్లమెంటు)లోకి దూసుకువచ్చారు. బ్యారికేడ్లను దాటుకుని వెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు. నూతన ప్రెసిడెంట్‌గా డెమొక్రాట్‌ జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకున్నారు. క్యాపిటల్‌ భవనంలోని కిటికీలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి దూసుకువెళ్లి వీరంగం సృష్టించారు.‌ ఈ ఆందోళనల సందర్భంగా చెలరేగిన కాల్పుల కలకలంలో ఓ మహిళ మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

ఈ ఘటనపై అమెరికా చట్టసభ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సెనేటర్‌ మిచ్‌ మెకానెల్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటివేనని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల్లోనూ 306- 232 తేడాతో ట్రంప్‌నకు అందనంత దూరంలో నిలిచి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. అయితే ఆది నుంచి తన ఓటమిని అంగీకరించని ట్రంప్‌.. ఫలితాన్ని తారుమారు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో.. స్వింగ్‌ స్టేట్‌ అయిన జార్జియా ఎన్నికల చీఫ్‌కు ఆయన చేసిన ఫోన్‌ కాల్‌ ఆడియో లీకైన విషయం తెలిసిందే. బుధవారం మరోసారి.. ''మనం దీనిని వదిలే ప్రసక్తే లేదు'' అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. దీంతో ఈ ఆందోళనలు చెలరేగాయి. అయితే ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ట్రంప్‌.. పోలీసులకు సహకరించాలని, సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''హింస ఎన్నటికీ గెలవదు. స్వేచ్ఛ మాత్రమే విజయం సాధిస్తుంది. ఇప్పటికీ ఇది ప్రజల సభ మాత్రమే'' అని పేర్కొన్నారు. ఆందోళనకారుల చర్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.

Next Story
Share it