టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా చంద్రశేఖరన్

టాటా గ్రూప్ లో కీలక పరిణామం. టాటా సన్స్ చైర్మన్ గా తిరిగి కొనసాగింపు కోరుకోకూడదు అని నిర్ణయించుకున్న ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కు మరో ఐదేళ్ల పొడిగింపు దక్కింది. గురువారం నాడు జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ ను మరో ఐదేళ్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగించాలని మెజారిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని టాటా సన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని సారాంశం ఇలా ఉంది. సెప్టెంబర్ 2025లో చంద్రను మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించేందుకు టాటా సన్స్ బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత అధికారిక ఆమోదాన్ని ఫిబ్రవరి 2026లో పొందాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 2026లోజరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్మానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.
అనంతరం మే 2026, జూన్ 2026లో జరిగిన బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆగస్టు 12, 2026న, తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన అనంతరం తిరిగి నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోకూడదని చంద్రశేఖరన్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు కూడా. సెప్టెంబర్ 3, 2026న, టాటా సన్స్ బోర్డుకు చెందిన నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (NRC) సమావేశం అయి చంద్రశేఖరన్ ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించే అంశంపై చర్చించింది. సమగ్రంగా చర్చించిన అనంతరం, ఆయన చేసిన సేవలను, టాటా గ్రూప్ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని చంద్రను కోరుతూ, తదుపరి బోర్డు సమావేశంలో ఆయనను తిరిగి నియమించాలని సిఫారసు చేయాలని ఎన్ ఆర్ సి ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ మేరకు సెప్టెంబర్ 17, 2026న జరిగిన బోర్డు సమావేశంలో తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలన్న బోర్డు అభ్యర్థనకు చంద్ర అంగీకరించారు. అనంతరం, ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయనను తిరిగి నియమించాలని బోర్డు మెజారిటీ ఓటుతో తీర్మానించింది. అమలులో ఉన్న ఆర్ బిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించాలని కూడా బోర్డు నిర్ణయించింది. నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన కంప్లయన్స్ అవసరాలపై ఆర్ బిఐ , టాటా ట్రస్ట్స్, ఇతర వాటాదారుల నుంచి మార్గదర్శకత్వం పొందాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే టాటా సన్స్ నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా ఉన్న నోయెల్ టాటా వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.



