Telugu Gateway
Top Stories

ఎట్టకేలకు కదలనున్న ఆర్టీసీ బస్సులు

ఎట్టకేలకు కదలనున్న ఆర్టీసీ బస్సులు
X

చర్చలు కొలిక్కివచ్చాయి. కిలోమీటర్ల లెక్కలు తేలాయి. అంతిమంగా తెలంగాణ-ఏపీల మధ్య బస్సు సర్వీసులు మాత్రం ప్రారంభం కానున్నాయి. రెండు ప్రభుత్వాల వైఖరి వల్ల దసరా పండగ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ఇప్పటికైనా బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒఫ్పందం కుదరటం ప్రయాణికులకు ఊరట కల్పించే అంశమే. చివరకు దీపావళికి అయినా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మార్గం సుగమం అయింది. సోమవారం నాడు హైదరాబాద్ లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది.

తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. విజయవాడ రూట్‌లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కర్నూలు- హైదరాబాద్‌ రూట్ లో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

Next Story
Share it