Telugu Gateway
Top Stories

ముంబయ్ పోలీసు కమిషనర్ పై 200 కోట్ల దావా

ముంబయ్ పోలీసు కమిషనర్ పై 200 కోట్ల దావా
X

టీఆర్పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్. రిపబ్లిక్ టీవీ, ఛానల్ ఎడిటర్ ఇన్ చీప్ అర్ణబ్ గోస్వామి సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై 200 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. టీఆర్పీ స్కామ్ కు సంబంధించి ఆరోపణలు చేయటం ద్వారా రిపబ్లిక్ టీవీ, అర్ణబ్ ప్రతిష్టకు నష్టం కలిగించారనేది ఛానల్ ఆరోపణ. టీఆర్పీ కేసు ఎప్ఐఆర్ లో రిపబ్లిక్ టీవీ పేరు లేదని మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయ్ పోలీసులు కోర్టులో అంగీకరించారని ఛానల్ ఓ ప్రకటనలో తెలిపింది. వంద కోట్ల రూపాయల పరువు నష్టం ఛానల్ ప్రతిష్ట దెబ్బతీసినందుకు, మరో వంద కోట్ల రూపాయలు అర్ణబ్ గోస్వామి ప్రతిష్టకు నష్టం చేసినందుకు పరువు నష్టం కేసు వేయనున్నట్లు తెలిపారు. ఛానల్ కు చెందిన లీగల్ టీమ్ పరమ్ బీర్ సింగ్ పై కేసు దాఖలు చేసే పనిలో ఉన్నాయని తెలిపారు. పోలీస్ కమిషనర్ చెప్పిన దానికి భిన్నంగా మహారాష్ట్ర ప్రభుత్వ లాయర్ కోర్టులో భిన్నమైన వాదన విన్పించారన్నారు. ఎఫ్ఐఆర్ లో రిపబ్లిక్ పేరు లేదని వెల్లడించారన్నారు.

అయితే ముంబయ్ పోలీసులు మాత్రం కొంత మంది సాక్ష్యులు రిపబ్లిక్ టీవీ ఛానల్ పేరును వెల్లడించారని..తమకు అదే ఛానల్ పెట్టి ఉంచాల్సిందిగా డబ్బులు ఇచ్చారని కొద్ది రోజుల క్రితం పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ లో రిపబ్లిక్ టీవీ కాకుండా ఇండియా టుడే ఛానల్ పేరు ఉందని..అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు గతంలో వెల్లడించారు. టీఆర్పీ స్కామ్ రకరకాల ట్విస్ట్ లు తీసుకుంటోంది. అంతిమంగా ఇది ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. ఈ దెబ్బకు బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఏకంగా న్యూస్ ఛానళ్ల రేటింగ్ లను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it