Telugu Gateway
Top Stories

రిలయన్స్, ప్యూచర్ గ్రూప్ డీల్ కు బ్రేక్

రిలయన్స్, ప్యూచర్ గ్రూప్ డీల్ కు బ్రేక్
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడుకి బ్రేక్ పడింది. ఓ వైపు టెలికం మార్కెట్ లో , మరో వైపు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు రిలయన్స్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆ క్రమంలోనే విదేశీ సంస్థల నుంచి లక్ష్ల ల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. రిటైల్ రంగంలో మరింత పట్టుపెంచుకునేందుకు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్, కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపును 24,713 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిలయన్స్ డీల్ కంటే చాలా ముందుగా ఫ్యూచర్ గ్రూప్ తమతో ఒప్పందం చేసుకుందని అమెజాన్ లీగల్ నోటీసులు పంపింది. ఈ ప్రక్రియ మందుకు సాగకుండా చూడాలని లీగల్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఎస్ఐఏసీ)లో పిటీషన్ దాఖలు చేసింది. తాము నిర్ణయం వెలువరించే వరకూ రిలయన్స్ తో కుదిరిన డీల్ పై ముందుకు పోవద్దని సింగపూర్ ఆర్భిట్రేషన్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తాత్కాలికంగా ఈ డీల్ కు బ్రేక్ పడినట్లు అయింది. ఇది అమెజాన్ కు ఊరట కిందే లెక్క.

గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది అమెజాన్. అప్పట్లో ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థలో ఫ్యూచర్‌ కూపన్స్‌ కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపు ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారం ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందాన్ని నిలిపివేయాలని కోరుతూ అమోజాన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ భావిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత జాప్యం అవుతుందా లేక బయట పరిష్కార మార్గాలను అన్వేషిస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it