ఐదేళ్లలో తొలిసారి లక్ష యూనిట్ల లోపు అమ్మకం

దేశ ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో కీలక పాత్ర ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ రంగం ఫుల్ జోష్ లో ఉంటే ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు పెడుతున్నట్లే లెక్క. గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మరింత దెబ్బతిన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. 2026 జనవరి-మార్చి కాలంలో అమ్మకాలు లక్ష యూనిట్ల దిగువకు పడిపోయాయి. గత నాలుగున్నర సంవత్సరాల్లో ఇంత తక్కువ మొత్తం అమ్మకాలు నమోదు కావటం ఇదే మొదటి సారి అని దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రాక్ చేసే ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇంత డల్ మార్కెట్ లో కూడా బెంగళూరు, ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్ సిఆర్ )లో మాత్రం అమ్మకాలు పెరిగాయి.
హైదరాబాద్ లో మాత్రం అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తోలి మూడు నెలల కాలంలో హైదరాబాద్ లో కేవలం 11546 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదు అయ్యాయి. చెన్నై లో కూడా అమ్మకాలు నాలుగు శాతం మేర తగ్గి 4765 యూనిట్లకు పరిమితం అయ్యాయి. తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం గత ఏడాది తో పోలిస్తే సప్లై ఏకంగా 62 శాతం తగ్గుముఖం పట్టింది. దేశంలోని మొత్తం తొమ్మిది కీలక నగరాల్లో కలుపుకుని అమ్మకాలు 98 ,761 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ. కొత్త యూనిట్ల సరఫరా కూడా 19 శాతం మేర తగ్గి 92411 యూనిట్ల కు పరిమితం అయింది.
కోల్‌కతా తో నవి ముంబై వంటి ప్రాంతాల్లో కూడా అమ్మకాలు బాగానే తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ పరిస్థితుల కారణంగా కొత్త వెంచర్లు స్టార్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. అయితే రాబోయే నెలల్లో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒక వైపు అత్యధిక వేతనాలు ఉండే ఐటి రంగంలో ఏఐ సృష్టిస్తున్న అల్లకల్లోలం ఒకటి అయితే...గత నెల రోజులకు పైగా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు చేస్తున్న యుద్ధం ప్రభావం వంటివి రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ పై మరింత పడే అవకాశం ఉంది అని ఈ రంగంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ధరలు పెరగటం ఖాయం. ఈ యుద్ధం కారణంగా ఏప్రిల్ నెల నుంచి సిమెంట్, స్టీల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అని...ఈ డల్ మార్కెట్ లో ఇది కూడా ఒక ప్రతికూల అంశంగా మారే ప్రమాదం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



