Telugu Gateway
Top Stories

దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్

దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్
X

ప్రధాని నరేంద్రమోడీ కరోనా అంశంపై మరోసారి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. దేశంలో కేసులు తగ్గుతున్నాయని..ఎవరూ కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని..ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే అందరికీ అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా వైరస్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, కోవిడ్‌-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా తేరుకుంటోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచంతో పాటు భారత్‌ సైతం వేచిచూస్తోందని అన్నారు. మోడీ మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోడీ ఏదైనా సంచలన విషయాలు వెల్లడిస్తారేమో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆయన పండగ జాగ్రత్తలు మాత్రమే చెప్పారు.

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..' అమెరికా, బ్రెజిల్ లతో పోలిస్తే భారత్ లో పరిస్థితి మెరుగ్గా ఉంది. కరోనా తగ్గుతోందని నిర్లక్ష్యం వద్దు. ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా పండగల సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లేటేప్పుడు విధిగా మాస్క్ లు దరించటంతోపాటు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. మాస్క్ లు లేకుండా బయటకు వెళితే అలాంటి వారు కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లే లెక్క. భారత్ లో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. రికవరి రేటు కూడా చాలా ఎక్కువ. భారత్ లో పది లక్షల మందిలో ఐదున్నర వేల మందికి కరోనా సోకింది. అమెరికా, బ్రెజిల్ లో పది లక్షల మందిలో 25 వేల మందికి కరోనా సోకింది. అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. కరోనాతో ప్రమాదంలేదని అనుకోవద్దు. కరోనా టెస్ట్ ల కోసం దేశంలో రెండు వేల ల్యాబ్ లు పనిచేస్తున్నాయి. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య పది కోట్ల దాటనుంది. పరీక్షల సంఖ్యనుపెంచటంలో వైద్య విభాగం అత్యంత వేగంగా పనిచేసింది' అని మోడీ తెలిపారు.

Next Story
Share it