Telugu Gateway
Top Stories

దేశంలో వంద రూపాయలకు చేరిన పెట్రోలు

దేశంలో వంద రూపాయలకు చేరిన పెట్రోలు
X

కరోనా సమయంలో దేశంలో పెట్రో ఉత్పత్తుల డిమాండ్ చరిత్రలో ఎన్నడూలేనంతగా తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ధరలు కరోనా తొలి రోజుల్లో అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. క్రమక్రమంగా లాక్ డౌన్లు తొలగిపోవటంతో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ కూడా పెరుగుతూ పోతుంది. అదే సమయంలో ధరలు మాత్రం ఎన్నడూలేని రీతిలో రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. క్రూడ్ రేట్లు తక్కువ ఉన్న సమయంలో కూడా రేట్లు తగ్గించాల్సిన కేంద్రం పన్నులు పెంచుతూ పెట్రో ఉత్పత్తుల రేట్లను పెంచుతూ ఖజానా నింపుకుంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే కేంద్రం మాత్రం ధరలు పెంచుతూనే ఉంది. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు అదే పరిస్థితి..ఇప్పుడు కూడా అదే పరిస్థితి. తాజాగా దేశంలో ఇంథన ధరలు కొత్త రికార్డులకు చేరాయి. వరుసగా రికార్డులను నమోదు చేస్తున్నలీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 38 పైసల పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు 101.80 రూపాయలకు చేరుకుంది.

రాజధాని జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ .93.86, డీజిల్ ధర 85.94 లు పలుకుతోంది. రాజస్థాన్ అంతటా, పెట్రోల్ 93 రేపాయలకు ఎగువన, డీజిల్ ధర రూ.85 కంటే ఎక్కువగానే ఉండటం విశేషం. వ్యాట్‌లో తేడాలు కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భిన్నంగా ఉంటాయి. 2020 మేలో రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధరలపై వ్యాట్ 28 శాతం ఉండగా, పెట్రోల్‌పై వ్యాట్ 38 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 20 శాతం నుంచి 33 శాతం, డీజిల్‌పై 16 శాతం నుంచి 23 శాతం వ్యాట్‌ అమల్లో ఉండగా, రాజస్థాన్‌లో ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ 4- 8 నుంచి 10 -11 రూపాయలు ఎక్కువ.

Next Story
Share it