Telugu Gateway
Top Stories

జనవరిలో కరోనా వ్యాక్సిన్

జనవరిలో కరోనా వ్యాక్సిన్
X

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి కీలక పరిణామం. ఈ వ్యాక్సిన్ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రావటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ విషయాన్ని సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. భారత్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ప్రయోగాలను సీరమ్ చేపట్టిన సంగతి తెలిసిందే. మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కు సంబంధించి అత్యంత కీలకమైన మూడవ దశ ప్రయోగాలు కూడా తుది దశకు చేరుకున్నాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ 2021 జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని పూనావాలా తెలిపారు. ట్రయల్స్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదం సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

భారత్, యూకేల్లో జరుగుతున్న పరీక్షల ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం కొవిషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడు దశల పరీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రస్తావించిన అదర్ పూనావాలా కొవీషీల్డ్‌ కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్‌ షాట్ తీసుకున్నారని తెలిపారు. అన్ని అనుమతులతో రానున్న ఈ వ్యాక్సిన్ ధర కూడా అందుబాటులోనే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రం భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మాత్రం వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఆ సంస్థ మూడవ దశ ప్రయోగాలు ప్రారంభించాల్సి ఉంది. ఓ వైపు వ్యాక్సిన్లకు సంబంధించి ఆశాజనక వార్తలు వస్తుంటే వీటి సమర్ధత తేలటానికి చాలా సంవత్సరాలు పడుతుందని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it