Telugu Gateway
Top Stories

టీవీ5 ఛైర్మ‌న్ నుంచి ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ఖాతాకు 8.8 కోట్ల రూపాయ‌లు

టీవీ5 ఛైర్మ‌న్ నుంచి ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ఖాతాకు 8.8 కోట్ల రూపాయ‌లు
X

ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న అఫిడ‌విట్

కుట్ర‌లో చంద్ర‌బాబు, లోకేష్‌, మీడియా ఛాన‌ళ్ళు

బార్ అండ్ బెంచ్ సంచ‌ల‌న క‌థ‌నం

ఏపీ స‌ర్కారు..ఛానళ్ల మ‌ధ్య వివాదం కొత్త మ‌లుపు తిరిగింది. సుప్రీంకోర్టులో ప్ర‌భుత్వం వేసిన అఫిడ‌విట్ లో సంచ‌ల‌న అంశాల‌ను ప్ర‌స్తావించింది. టీవీ5 ఛైర్మ‌న్ ఖాతాను నుంచి వైసీపీ ఎంపీ రఘురామ‌క్రిష్ణంరాజు ఖాతాకు ప‌ది ల‌క్షల యూరోలు (8.8 కోట్లు) బ‌దిలీ అయిన‌ట్లు పేర్కొంది. అందుకు బదులుగా (క్విడ్‌ ప్రో కో) రఘురామ రాజు తన పదవిని ఆయా న్యూస్‌ చానళ్లకు సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యాన్ని తాము పవిత్రమైనదిగానే భావిస్తామని, పత్రికలకు ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర ఉందని.. అయితే, వాటిని ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతించలేమని తెలిపింది. రఘురామకృష్ణ రాజు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలను ముందుగానే ఒక పథకం ప్రకారం తయారు చేసి ప్రసారం చేశారని.. న్యూస్‌ చానల్స్‌, టీడీపీ సభ్యులు, రఘురామకృష్ణం రాజు వివరంగా చర్చించుకున్న తర్వాతనే ఈ ప్రసారాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఆయన ప్రసంగాలు క్షేత్రస్థాయిలో హింసకు కూడా దారితీశాయని తెలిపింది, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దీని వెనుక ఉన్నట్టు ఆరోపించింది. రఘురామ రాజు, చంద్రబాబు, లోకేశ్‌ మధ్య ఫోన్లలో జరిగిన సంభాషణలు, వారు షేర్‌ చేసుకున్న డాక్యుమెంట్లు.. ప్రజాస్వామికంగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రను వెల్లడిస్తున్నాయని జగన్‌ సర్కార్‌ తమ అఫిడవిట్‌లో పేర్కొంది.

దర్యాప్తు సమయంలో రఘురామ కృష్ణం రాజు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్‌ను పరిశీలించి రూపొందించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, ఆయన సెల్‌ ఫోన్‌ నుంచి వచ్చిన మొత్తం ఎలకా్ట్రనిక్‌ వివరాలను కోర్టు ముందు ఉంచినట్టు తెలిపింది. రఘురామకృష్ణం రాజు ప్రెస్‌ మీట్ల తర్వాత మీడియా వ్యక్తులనుంచి ఆయనకు ప్రశంసలు వచ్చాయని ఆరోపించిన జగన్‌ ప్రభుత్వం.. అందులో కొన్నింటిని అఫిడవిట్‌లో ఉటంకించింది. ''వావ్‌.. మీరు మంచి పంచ్‌ ఇచ్చారు'', ''సింహం ఒంటరిగా వస్తుంది.. పం దులు గుంపులుగా వస్తాయి'', ''మీ సమాధానాలతో సోషల్‌ మీడియాలో ఉద్రేకం చెలరేగింది'', ''మీ దారి రహదారి'', ''మీరు పార్టీకి పెద్ద బొక్క పెడుతున్నారు'', ''సింహం కూర్చున్నదే సింహాసనం'', ''మీ ఇంటర్వ్యూ సూపర్‌ హిట్‌'', ''మళ్లీ ఇవాళ సూపర్‌హిట్‌ అయ్యింది. యూట్యూబ్‌ స్ట్రీమ్‌ 10వేలు దాటింది''.. అంటూ చానళ్లు రఘురామ రాజును ప్ర‌శంసించార‌ని పేర్కొంది. ఈ విష‌యాల‌ను బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ లో ప్ర‌చురించారు.

Next Story
Share it