కనకదుర్గ ఫ్లైవర్ ను ప్రారంభించిన గడ్కరీ..జగన్
ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం పూర్తయింది. విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల వరకూ విజయవాడ నగరంలోకి ప్రవేశించాలంటే కనకదుర్గ దేవాలయం వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యేవారు. హైదరాబాద్ నుంచి అక్కడ వరకూ చేరుకోవటం ఒకెత్తు..అక్కడ నుంచి నగరంలోకి ప్రవేశించటం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. కేంద్రమంత్రి ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.
అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం చేశారు. రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్ పూర్తయింది. వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే ఇది పూర్తి కావాల్సి ఉన్నా...నిర్మాణ సంస్థ నిర్వాకం తదితర కారణాలతో ఇందులో విపరీత జాప్యం జరిగింది.