Telugu Gateway
Top Stories

జెట్ ఎయిర్ వేస్ టేకాఫ్ కు రెడీ అయినట్లేనా!

జెట్ ఎయిర్ వేస్ టేకాఫ్ కు రెడీ అయినట్లేనా!
X

కీలక పరిణామం. జెట్ ఎయిర్ వేస్ కు సంబంధించి శనివారం నాడు అత్యంత ముఖ్యమైన నిర్ణయం వెలువడిండి. దివాళా తీసిన ఈ ఎయిర్ లైన్స్ పునరుద్దరణకు సంబంధించి ప్రణాళికను ఈ సంస్థకు పెద్ద ఎత్తున రుణాలు ఇఛ్చిన బ్యాంకులతో కూడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీవోసీ) ఆమోదం తెలిపింది. దీంతో ఒకప్పుడు దేశీయ విమానయాన రంగంలో ఓ వెలుగు వెలిగిన జెట్ ఎయిర్ వేస్ మళ్ళీ టేకాఫ్ అయ్యేందుకు మార్గం సుగమం అయినట్లు కన్పిస్తోంది. అయితే ఇంకా ఈ ప్రక్రియ పలు దశలు దాటాల్సి ఉందని చెబుతున్నారు. లండన్ కు చెందిన కార్లాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మురారీ లాల్ జలన్ లు జెట్ ఎయిర్ లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను సమర్పించారు.

ఈ వోటింగ్ ద్వారా శనివారం నాడు సీవోసీ దీనికి ఆమోదం తెలిపింది. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుని గత ఏడాది ఏప్రిల్ లో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ టీ)లో దివాళా ప్రక్రియ సాగుతూ వచ్చింది. తాజా ప్రతిపాదనకు ఎన్ సీఎల్ టీ ఆమోదం లభించాల్సి ఉంది. ఎన్ సీఎల్ టి ఆమోదం పొందిన తర్వాత జెట్ ఎయిర్ వేస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ లైన్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దశలో జెట్ ఎయిర్ వేస్ కు కొత్త ప్రమోటర్లు దొరకటం కీలక పరిణామమే.

Next Story
Share it