Telugu Gateway
Top Stories

హైదరాబాద్ లో జల విలయం

హైదరాబాద్ లో జల విలయం
X

హైదరాబాద్ ఎప్పుడూ చూడని వర్షం చూసింది. ప్రజలు కూడా గతంలో ఎన్నడూ లేని కష్టాలు పడాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా లేదు. దీంతో ప్రజలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇది ఒకెత్తు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకే భారీ ఎత్తున నీరు చేరటంతో ఇక వారి బాధలు వర్ణనాతీతం. కార్లకు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల మనుషులు కూడా హైదరాబాద్ లో వర్షపు నీటికి కొట్టుకుపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కారు అక్టోబర్ 14, 15 తేదీల్లో సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు కూడా సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళటం చాలా కష్టంగా మారింది. పీవీ ఎక్స్ ప్రెస్ ను కూడా క్లోజ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మార్గం ద్వారా మాత్రమే విమానాశ్రాయనికి వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. దీంతో ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎధుర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు మొత్తంగా 32 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వందేళ్ళలో ఎప్పుడూ ఇంత భారీ వర్షపాతం నమోదు కాలేదని చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. మంత్రి కె. తారకరామారావు మూసారాంబాగ్ ప్రాంతాన్ని సందర్శించారు.

సలీంనగర్లో ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. .రానున్న ఒకటీరెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీహెంఎసీ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండాలని కోరారు. ఆయా కేంద్రాల్లో ఆహారంతో పాటు, మందులు, వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ఉప్పల్‌- ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌- కోటి రహదారిని మూసివేశారు. బేగంపేటలో వరద నీరు పొంగిపొర్లుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నీరే కన్పిస్తోంది. నిజాంపేటలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బండారి లేఅవుట్‌ వరకు నీటితో నిండిపోయింది. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో హై రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. బెంగుళూరు హైవే, హైదరాబాద్‌- విజయవాడ హైవేను మూసివేశారు.

Next Story
Share it