తమన్నా..రానా..ప్రకాష్ రాజ్ లకు కోర్టు నోటీసులు
ప్రజలకు అవి ప్రమాదం అని తెలిసినా సెలబ్రిటీలు కేవలం డబ్బు కోసం వాటి ప్రమోషన్స్ కు ఏ మాత్రం వెనకాడటం లేదు. అవి శీతల పానీయాలు అయినా ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ యాప్ లు అయినా. సినీ తారలే కాదు..క్రికెటర్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. అప్పటికే వారు తమ తమ రంగాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా కూడా అనైతిక వ్యాపారాలకు అండగా నిలవటం విమర్శలకు తావిస్తోంది. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు సినీ తారలతోపాటు క్రికెట్ సెలబ్రిటీలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించటమే దీనికి కారణం.
క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్, తమన్నా తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు మంగళవారం నాడు విచారణ జరిపింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్ తెలిపారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ నిషేధానిక సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.