Telugu Gateway
Top Stories

గుడ్ న్యూస్...అప్పటికి కరోనా ఖతం

గుడ్ న్యూస్...అప్పటికి కరోనా ఖతం
X

ప్రస్తుతం అందరూ కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ ఈ డిసెంబర్ నాటికి ..జాప్యం అయితే జనవరిలో అందుబాటులోకి రావాటం పక్కా అనే సంకేతాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలను పరిశీలిస్తే ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రం రావటం ఖాయం. అయితే ఈ వ్యాక్సిన్ సమర్ధత తేలాలంటే చాలా కాలం వేచిచూడాల్సిందే. అయితే వచ్చే వ్యాక్సిన్ కరోనా నుంచి 50 శాతం మేర రక్షణ ఇస్తుందా? లేక పూర్తి రక్షణ ఇస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. అందరూ వ్యాక్సిన్ కోసం ఫిక్స్ అయి..డిసెంబర్, జవవరి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటి అంటే వచ్చే ఏడాది పిబ్రవరి నాటికి భారత్ లో కరోనా ఖతం అవుతుంది అని. ఇప్పటికే కరోనా భారత్ లో పీక్ దశను దాటేసిందని ప్రభుత్వం నియమించిన నిపుణులు కమిటీ తేల్చిచెప్పింది. అంతే కాదు 2021 పిబ్రవరి నాటికి ప్రపంచాన్ని వణికించిన కరోనా పీడ వదిలిపోతుందని చెబుతోంది. అయితే కోవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్‌ తోకముడిచే నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది.

భారత్‌లో ప్రస్తుతం మొత్తం 75 లక్షల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ తీవ్రత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించింది. అయితే వచ్చే పండగల సీజన్ లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. చలికాలంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మార్చిలో లాక్ డౌన్ విధించకపోయి ఉంటే ఆగస్టు వరకూ దేశంలో కరోనా మృతుల సంఖ్య 25 లక్షలు దాటేదని భారత్ సూపర్ మోడల్ కమిటీ పేర్కొంది. ఈ కమిటీకి హైదరాబాద్ ఐఐటికి చెందిన ప్రొఫెసర్ విద్యాసాగర్ సారధ్యం వహించారు. బహిరంగ కార్యక్రమాల ద్వారా కరోనా వ్యాప్తి పెరుగుతుందనటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కమిటీ తెలిపింది. ఆగస్టులో ఓనం నిర్వహించటంతోనే సెప్టెంబర్ లో ఒకేసారి కేసుల సంఖ్య పెరిగిందని గుర్తించినట్లు తెలిపారు.

Next Story
Share it