Telugu Gateway
Top Stories

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ....మరో గుడ్ న్యూస్

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ....మరో గుడ్ న్యూస్
X

గుడ్ న్యూస్. భారత్ లో సత్వరమే అందుబాటులోకి రానున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు సంబంధించి మంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాల్లో కూడా 70.4 శాతం సమర్ధతను చూపించినట్లు వెల్లడించారు. ఇది భారత్ కు సంబంధించినంత వరకూ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలకు చెందిన ఈ వ్యాక్సిన్ ను సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేయనున్న విషయం తెలిసిందే. సీరమ్ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారు. దీంతో ఇప్పటికే ఫైజర్, మోడెర్నాలతో పాటు మరో కీలక వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రాథమిక ఫలితాలు కూడా సానుకూలంగా వచ్చినట్లు అయింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సోమవారం నాడు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. తమ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది. ప్రయోగ ఫలితం 90 శాతం ప్రభావవంతంగా ఉందని, 70 శాతం మందిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉందని వెల్లడించింది. క్లీనికల్ ట్రయల్స్‌ సమాచారంపై జరిపిన తొలి విశ్లేషణలో వలంటీర్లలో సగటున 70 శాతం మందిని రక్షించినట్టు వెల్లడైందని ఆస్ట్రాజెనెకా తెలిపింది.

క్లినికల్ ట్రయల్స్‌ లో భాగంగా ఆక్స్‌ ఫర్డ్ టీకా విషయంలో అధికారులు రెండు రకాల డోసుల వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు తొలుత సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇచ్చారు. టీకా 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. సుమారు 24 వేల మంది వాలంటీర్ల నుంచి ఈ డేటాను సేక‌రించారు. బ్రిట‌న్‌, బ్రెజిల్‌, ద‌క్షిణ ఆఫ్రికాల్లో భారీ స్థాయిలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు.ఆక్స్ ఫర్డ్ ప్రకటనపై సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా కూడా స్పందించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 90 శాతం వరకూ సమర్థత కలిగి ఉంటుందని తెలిపారు. సీరమ్ ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి నాలుగు కోట్ల డోస్ లను ఉత్పత్తి చేసింది. ఇది అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతోపాటు..తేలిగ్గా కూడా సరఫరా చేసే వెసులుబాటు కలిగి ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఇది విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని అన్నారు.

Next Story
Share it