Telugu Gateway
Top Stories

జియో బ్లాక్ రాక్ నుంచి స్టాక్ బ్రోకర్ సేవలు

జియో బ్లాక్ రాక్  నుంచి  స్టాక్ బ్రోకర్ సేవలు
X

గత కొన్ని రోజులుగా జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్ లో దుమ్మురేపుతున్నాయి. ఈ ఏడాది మార్చి మూడున ఈ కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి 199 రూపాయలకు పతనం అయ్యాయి. కానీ ఈ మూడు నెలల వ్యవధిలోనే కంపెనీ షేర్లు ఏకంగా 124 రూపాయల మేర లాభపడ్డాయి. గత కొన్ని రోజులుగా ఈ కౌంటర్ లో వాల్యూమ్స్ కూడా భారీ ఎత్తున పెరిగాయి. ఈ శుక్రవారం నాడు అంటే జూన్ 27 న బిఎస్ఈ లో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు 11 రూపాయల లాభంతో 323 రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి. ఒక దశలో శుక్రవారం నాడు ఈ షేర్లు 329 రూపాయలకు చేరాయి.

మరో వైపు జియో ఫైనాన్సియల్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు లక్షల ఐదు వేల కోట్ల రూపాయలను అధిగమించింది. సెబీ శుక్రవారం నాడే జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాక్ బ్రోకర్/క్లియరింగ్ మెంబర్ గా అనుమతి మంజూరు చేసింది. జియో బ్లాక్ రాక్ లు మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ తో పాటు ఇతర ఆర్థిక సేవలు సంయుక్తంగా అందించనున్నాయి. ఈ షేర్ల 52 వారాల గరిష్ట ధర 363 రూపాయలుగా ఉంది. ఒకటి, రెండు సంవత్సరాల్లో ఈ కంపెనీ షేర్లు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story
Share it