తొలి దశ వ్యాక్సిన్లపై నిపుణుల అనుమానాలు
ప్రపంచం అంతా కరోనాకు సంబంధించి సమర్ధవంతమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ వచ్చే తేదీలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కొంత మంది ఈ సంవత్సరాంతానికి అంటుంటే మరికొంత మంది కొత్త సంవత్సరంలోనే అని చెబుతున్నారు. మరి కొంత మంది అయితే ఇంకా ఏడాది వరకూ పట్టొచ్చనే అంచనాలను వెలువరిస్తున్నారు. ఈ తరుణంలో యూకెకు చెందిన టాస్క్ ఫోర్స్ నిపుణులు మాత్రం తొలి తరం కోవిడ్ 19 వ్యాక్సిన్ లు అంత సమర్థవంతంగా పనిచేయకపోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో మరే వ్యాధికి ఇంత త్వరగా వ్యాక్సిన్ రావాలని ఆశించిన దాఖలాలు లేవని యూకె టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కేట్ బింగమ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తొలి తరం టీకాలు అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు. అసలు కరోనాకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ వస్తుందో రాదో కూడా చెప్పలేమన్నారు. అయితే ఈ టీకాలు పూర్తిగా కరోనాను నియంత్రించకపోయినా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని ప్రకటించారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో వ్యాక్సిన్లు విఫలం అయ్యే అవకాశం ఉందని గుర్తించామని ప్రకటించటం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ కూడా తాము అభివృద్ధి చేసే వ్యాక్సిన్ సమర్ధత 60 శాతం వరకు మాత్రమే ఉంటుందని ప్రకటించింది. అంతే కాదు..50 శాతం సమర్ధత ఉన్న వాటికి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నియంత్రణా సంస్థలు అనుమతి ఇస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో ఇప్పుడు తయారు చేసే వ్యాక్సిన్లు ప్రతి ఒక్కరి మీద కూడా పనిచేస్తాయని చెప్పలేమని యూకె టాస్క్ ఫోర్స్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆస్త్రాజెనికా మాత్రం తాము అభివృద్ధి చేసే వ్యాక్సిన్ యువతపై ఎలా ప్రభావం చూపించిందో వృద్ధులపై కూడా అలాగే ప్రభావం చూపించిందని ప్రకటించింది. తొలుత ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. భారత్ బయోటెక్ కూడా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ను నవంబర్ లో ప్రారంభించనుంది. వ్యాక్సిన్ల వ్యవహారం ఇప్పుడు అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది.