Telugu Gateway
Top Stories

ట్రంప్ కు ఈ సారి మైక్ కట్ గండం

ట్రంప్ కు  ఈ సారి మైక్ కట్ గండం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దూకుడును అడ్డుకోవటం అంత ఆషామాషీ కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తొలి డిబేట్ లో ఇది స్పష్టమైంది. డెమాక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ ఓ మాట మాట్లాడుతుండగానే..నో నో అంటూ అడ్డుపడటం తెలిసిందే. మామూలుగా అయితే ఎవరి వాదన వారు విన్పించుకోవాలి. కానీ తొలి చర్చలో ఇద్దరు అభ్యర్ధులు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. రెండవ చర్చ ట్రంప్ కు కరోనా రావటంతో ఆగిపోయింది. వర్చువల్ చర్చకు ప్రతిపాదించినా దీనికి ట్రంప్ నో చెప్పటంతో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు అందరి కళ్లు అక్టోబర్ 22న జరగనున్న తుది చర్చపైనే ఉన్నాయి. అయితే ఈసారి చర్చ నిర్వహించే కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చర్చ మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఈ సారి 'మ్యూట్' విధానం అమల్లోకి తెచ్చింది. తొలి చర్చ అనుభవనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరి ప్రసంగానికి ఒకరు అడ్డుపడితే ఆటోమేటిగ్గా మైక్ కట్ అయిపోతుంది. ఈ నిర్ణయంపై ట్రంప్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ కు మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.

అయినా సరే ట్రంప్ చర్చలో పాల్గొంటారని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ట్రంప్ మాటలు చూస్తుంటే ఆయన చాలా ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తాను జో బైడెన్ చేతిలో ఓడిపోతే అమెరికా వదిలిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ వెల్లడవుతున్న ఓపీనియన్ పోల్స్ లో వాతావరణం జో బైడెన్ కు అనుకూలంగా ఉందనే సమాచారం వస్తోంది. అయితే చివరి నిమిషంలో ట్రంప్ ఏమైనా మ్యాజిక్ చేయకపోతారా అన్నది ఆయన మద్దతుదారుల ఆశ. అమెరికా ఎన్నికల సందర్బంగా అందుతున్న విరాళాలు ఇతర అంశాలను పరిశీలిస్తే జో బైడెన్ కు ఎడ్జ్ ఉన్నట్లు చెబుతున్నారు. నవంబర్ 3న అమెరికా అద్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Next Story
Share it