Telugu Gateway
Top Stories

అరవై శాతం సమర్ధతతో 'కోవాగ్జిన్ వ్యాక్సిన్'

అరవై శాతం సమర్ధతతో కోవాగ్జిన్ వ్యాక్సిన్
X

మూడవ దశ ఫలితాల 2021 మేలో రావొచ్చు

హైదరాబాద్ కేంద్రం గా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ తాజా పలు కీలక అంశాలను వెల్లడించింది. తాము కనీసం వ్యాక్సిన్ సామర్ధ్యత అరవై శాతం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ క్వాలిటీ ఆపరేషన్స్ హెడ్ ప్రసాద్ ఓ ఆంగ్ల ప్రత్రికకు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తోపాటు యూఎస్ ఎఫ్ డిఏ, భారత్ కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో)లు కూడా 50 శాతం సమర్ధత సాధించిన వాటికి కూడా అనుమతులు ఇవ్వటానికి రెడీ గా ఉన్నాయని, తాము అయితే అరవై శాతం వ్యాక్సిన్ సమర్ధతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా భారత్ బయోటెక్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రావటానికి ఏప్రిల్-మే వరకూ పడుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకూ భారత్ బయోటెక్ చేసిన రెండు దశల ఫలితాలు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఇవి ఇంకా అధికారికంగా సంబంధిత సంస్థలకు చేరాల్సి ఉంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ శాంపిల్ సైజు ఎక్కువ పరిమాణంలో ఉంటుందని , దీంతో పాటు ఇందులో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ లో కంపెనీ మూడవ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనుంది. 25 వేల మందికి మూడవ దశలో డోసులు ఇచ్చి పరీశీలించనున్నారు. భారత్ బయోటెక్ వెల్లడించిన వివరాల ప్రకారం వంద శాతం సమర్ధతతో కూడిన కరోనా టీకాలు ఇప్పట్లో రావటం కష్టం అనే విషయం తేలిపోయింది.

Next Story
Share it