డబ్ల్యూహెచ్ వో కే షాకిచ్చిన చైనా
చైనా మరోసారి తన బుద్ధి చూపించుకుంది. కరోనా వైరస్ మూలాలను కనుగొనే పనిలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నిపుణుల బృందానికి తమ దేశంలో ప్రవేశానికి నో చెప్పింది. ముందు అనుమతులు ఇస్తామని చెప్పి..తర్వాత వారి ఎంట్రీకి అవసరమైన ఏర్పాట్లు చేయకుండా వదిలేసింది. దీంతో ఆ శాస్త్రవేత్తలు అవస్థలు పడుతున్నారు. కోవిడ్19 తొలిసారి వెలుగుచూసిన వుహాన్ ను సందర్శించి దీనికి కారణమైన మూలాలను కనుగొనే పనిలో డబ్ల్యూహెచ్ వో ఉంది. ఈ పరిణామాలపై డబ్ల్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ ట్రెడోస్ అథనామ్ తీవ్ర అసంతృప్తి చేశారు. ట్రెడోస్ అథనామ్ చైనాకు కొమ్ముకాస్తున్నారని గతంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
వైరస్ విషయాన్ని సకాలంలో అందరికీ చేరవేయకుండా ప్రపంచంలో భారీ నష్టానికి కారణమైందనే విమర్శలు చైనా ఎదుర్కొంటుంది. పలు దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాయి కూడా. ట్రంప్ అయితే కరోనా వైరస్ ను ఏకంగా పలుమార్లు చైనా వైరస్ గా సంభోదించారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు ఇఫ్పటికే చైనాకు బయలుదేరగా ఆ దేశం ఎవరికీ అనుమతులు ఇవ్వటం లేదు. ఈ పర్యటన అంతర్జాతీయ సమాజానికి ఎంతో కీలకం అని ట్రెడోస్ వ్యాఖ్యానించారు. అనుమతి ఇస్తామని చెప్పి ఇలా చేయటం సరికాదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.