Telugu Gateway
Top Stories

మార్చిలో భారత్ బయోటెక్ 'కోవాగ్జిన్' వ్యాక్సిన్

మార్చిలో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్
X

కరోనాను ఎదుర్కొనేందుకు దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. అన్ని రకాల పరీక్షలు పక్కాగా పూర్తయిన తర్వాతే వచ్చే ఏడాది మార్చిలో తమ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల డైరక్టర్ సాయి ప్రసాద్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా సమర్ధత, భద్రతకు సంబంధించిన అంశాలపై తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో ఖచ్చితమైన ఆధారాలు వచ్చాకే.నియంత్రణా సంస్థల అనుమతితో దీన్ని విడుదల చేస్తామన్నారు. భారత్ బయోటెక్ ఈ కోవాగ్జిన్ ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రసాద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తమ సంస్థ డెవలప్ చేసే వ్యాక్సిన్ సమర్ధత కనీసం అరవై శాతం ఉంటుందని వెల్లడించారు. మిగిలిన వ్యాక్సిన్లు 50 శాతం సమర్ధతతో ఉన్నా కూడా నియంత్రణా సంస్థలు అనుమతిస్తాయన్నారు. ప్రపంచం అంతా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది.

అయితే తొలి దశ వ్యాక్సిన్ల సమర్ధతపై యూకెకు చెందిన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి అంత సమర్ధవంతంగా ఉండకపోవచ్చన్నారు. అయితే నిపుణులు మాత్రం సమర్ధత శాతం కంటే ముందు ఇవి కరోనా నుంచి రక్షణ కల్పిస్తే చాలు అనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పైనే దృష్టి పెట్టినట్లు పేర్కొంది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎస్‌ఐవి) భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ ఈ 'కోవాగ్జిన్‌' పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మాత్రం ఈ ఏడాది చివరిలో లేదా జనవరిలోనే అందుబాటులోకి రావచొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it