Telugu Gateway
Top Stories

ఏపీ నెక్ట్స్ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్!

ఏపీ నెక్ట్స్ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్!
X

ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఏపీ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) కాబోతున్నారా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ఆయనకు ఛాన్స్ రావాల్సి ఉందని..అనూహ్యంగా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నికి ఆరు నెలల గడువు పొడిగింపు దొరకటంతో దీనికి కొంత బ్రేక్ పడిందని చెబుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఆదిత్యనాథ్ దాస్ కు లైన్ క్లియర్ చేశాయంటున్నారు. ఏపీ సర్కారు అనూహ్యంగా ఈ నెల 14న అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్ఏ ఎఫ్ఏసీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ను అక్కడ నుంచి తప్పించింది, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. ఈ రెండు బాధ్యతలు ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు. తెలంగాణలో ఉన్న సమయంలో కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తీవ్రమైన ఆరోపణలతో అప్పటికప్పుడు ఆయన్ను హెచ్ఎండీఏ కమిషనర్ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఏపీ సర్కారు కూడా సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవటానికి వెనక కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఆదిత్యనాథ్ దాస్ కు ఈ రెండు శాఖల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని డిసెంబర్ లో పదవి విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సీఎస్ అవకాశం ఆదిత్యనాథ్ దాస్ కే దక్కుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో సీనియర్ అధికారి సతీష్ చంద్ర కూడా రేస్ లో ఉన్నా చంద్రబాబు పేషీలో ఉన్న సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు ఆయనకు మైనస్ గా మారుతున్నాయి. సతీష్ చంద్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో కూడా సతీష్ చంద్ర కీలకంగా ఉన్నారని ఆరోపించారు. దీంతోపాటుమరికొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా సతీష్ చంద్రపై ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి ఇప్పుడు సతీష్ చంద్రకు సీఎస్ పోస్టు ఇస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ అంశాలు సతీష్ చంద్రకు మైనస్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఆదిత్యనాథ్ దాస్ కే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story
Share it