Telugu Gateway
Top Stories

ట్రంప్ లైవ్ ను మధ్యలోనే కట్ చేసిన మీడియా

ట్రంప్ లైవ్ ను మధ్యలోనే కట్ చేసిన మీడియా
X

చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే గెలుపు తనదే అని ప్రకటన

రెండవసారి అధికారంలోకి రాకుండా కుట్ర చేశారని ఆరోపణలు

అమెరికాలో నిత్యం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూ..మీడియాకు నిత్యం ఫైట్ నడుస్తూనే ఉంటుంది. తనకు వ్యతిరేకంగా ఏ వార్త వచ్చినా సరే అది 'ఫేక్ న్యూస్' అంటూ ఓ మాటతో కొట్టేయటంతో ట్రంప్ కూ అలవాటే. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఇదే ట్రెండ్ ను పాలో అవుతున్నారు. ఇందులో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ముందు వరసలో ఉంటారని చెప్పొచ్చు. ఫేక్ న్యూస్ పదాన్ని ట్రంప్ ఎన్నిసార్లు వాడారో లెక్కే ఉండదు. అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఆయన తాజాగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితాలు వెలువడిన తొలి రోజే బయటకు వచ్చి తానే గెలిచానని..భారీ విజయోత్సావానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చి వెళ్లిపోయారు. తాజాగా శుక్రవారం నాడు మరోసారి ట్రంప్ మీడియా ముందుకు వచ్చారు. చట్టబద్ధ (లీగల్ ) ఓట్లు లెక్కిస్తే గెలుపు తనదే అని ప్రకటించారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ పద్దతిపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు..ఎన్నికల ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందన్నారు.

రెండవ సారి తనను అధికారంలోకి రానివ్వకుండా పెద్ద కుట్రే జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. మీడియా, ఎన్నికల అధికారులు డెమాక్రాట్లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఎంతో పెద్ద పెద్ద సాంకేతిక, మీడియా సంస్థలు జోక్యం చేసుకుని తనను ఓడించాలని ప్రయత్నించినా నిర్ణయాత్మక పెద్ద రాష్ట్రాల్లో తానే విజయం సాధించానని తెలిపారు. డెమెక్రాట్ల హవా నడుస్తోందని ప్రచారం చేశారని అది ఎక్కడా కన్పించలేదన్నారు. కేవలం తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోయారు తప్ప మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలూ తీసుకోలేదు. అదే సమయంలో ట్రంప్ అన్నీ అబద్ధాలు చెబుతూ, ఎన్నికల విధానంపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారనే కారణంతో పలు ప్రధాన మీడియా సంస్థలు ట్రంప్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశాయి. ట్రంప్ మెయిల్ ఇన్ ఓటింగ్ పద్దతిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది పూర్తిగా అవినీతితో కూరుకుపోయిందని ఆరోపిస్తున్నారు. డెమాక్రాట్లకు ఎన్ని ఓట్లు కావాలో చూసుకుని మరీ అన్ని ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. అకస్మాత్తుగా బ్యాలెట్లు వచ్చిపడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ట్రంప్ పలు రాష్ట్రాల్లో ఫలితాలపై ట్రంప్ కోర్టులను ఆశ్రయించారు.

Next Story
Share it