సీఎం కెసీఆర్..ఎందుకింత బేలగా?!
రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుపై వెలువడని అధికారిక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గత కొంత కాలంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. సవాళ్ల మీద సవాళ్ళు విసురుతోంది. అసలు బిజెపికి, కాంగ్రెస్ కు పరిపాలించటం చేతకాదు..కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తారు..చేసి చూపిస్తారు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్లు కూడా నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.ఇది అంతా పాత కధే. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించిన విషయంలో అధికార టీఆర్ఎస్, సీఎం కెసీఆర్ ఎందుకింత బేలగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. ధైర్యంగా తమ మద్దతు యశ్వంత్ సిన్హాకే అని ఎందుకు పార్టీ తరపున ఓ ప్రకటన విడుదల చేయలేకపోయింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణా సీఎం కెసీఆర్ కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేశారు..అందుకు కెసీఆర్ ఓకే అన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. టీఆర్ఎస్ మద్దతు యశ్వంత్ సిన్హాకే అని స్పష్టం చేసింది. ఆ పత్రికల్లో వచ్చిన కొన్ని లైన్లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. 'గత కొంత కాలంగా దేశంలో బిజెపి అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడంలో ఇతర పార్టీలు సాహసించటం లేదని,ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక్కరే ధైర్యంతో బిజెపిని తూర్పారపడుతున్నారని శరద్ పవార్ సీఎం కెసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కెసీఆర్ తమ వెంట ఉండాలని అన్ని ప్రాంతీయ పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. జాతి ప్రయోజనాల రీత్యా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.' అని రాశారు.
వాస్తవానికి ఏ పార్టీ అయినా..నాయకుడు అయినా తాము ఎటు ఉండాలి అన్నది వారి రాజకీయ అవసరాలు...ప్రత్యర్ధుల కదలికలు వంటి ఎన్నో అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా కెసీఆర్ వాళ్ల వెంట ఉండాలని ..వాళ్లు ఏకాభిప్రాయానికి రావటం ఏమిటో..సరే అని కెసీఆర్ అటు వైపు వెళ్ళటం ఏమిటో అన్నది ఆసక్తికరంగా మారింది. మీడియాలో కూడా వార్తలు అన్నీ శరద్ పవార్ అడిగారు..కెసీఆర్ ఓకే అన్నారు అంటూ వచ్చాయే తప్ప..టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా మాత్రం ప్రకటన జారీ చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇదే టీఆర్ఎస్ గతంలో విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ హాజరైనందున తాము ఉండబోమని..బిజెపి, కాంగ్రెస్ కు సమాన దూరంలో ఉంటామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వటానికి ఓకే చెప్పేసింది.