Telugu Gateway
Telugugateway Exclusives

అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి..లోకేష్ యాక్టివ్

అచ్చెన్నాయుడికి అధ్యక్ష  పదవి..లోకేష్ యాక్టివ్
X

ఇంత కాలం ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయిన నారా లోకేష్ సడన్ గా ఎందుకు ఇంత యాక్టివ్ అయ్యారు. కరోనా వచ్చిన తర్వాత దాదాపు ఆరేడు నెలలుగా నారా లోకేష్ హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విషయానికి వస్తే కుటుంబ సభ్యుల ఆంక్షలు, వయస్సు రీత్యా ఆయన హైదరాబాద్ లో నే ఉన్నారు. కానీ నారా లోకేష్ పరిస్థితి అది కాదు. అమరావతిలో ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉన్నా హైదరాబాద్ కు, ట్విట్టర్ రాజకీయాలే చేశారు. కానీ సడన్ గా జిల్లాల టూర్లు ప్రారంభించారు. నాన్చి నాన్చి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దసరా పండగకు ముందు అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి అప్పగించారు. ఈ పదవి అప్పగించటానికి ముందు రోజు నుంచే లోకేష్ యాత్రలు ప్రారంభించారు. ఇది అంతా ఓ వ్యూహం ప్రకారమే సాగుతుందనే చర్చ పార్టీలో నడుస్తోంది. సహజంగానే అచ్చెన్నాయుడిది దూకుడు స్వభావం. ఆయనకు పదవి ఇవ్వటం నారా లోకేష్ కు ఇష్టంలేదనే ప్రచారం బలంగా జరిగింది. అచ్చెన్నాయుడి స్థానంలో బీద రవిచంద్రను లోకేష్ తెరపైకి తీసుకొచ్చారు. కానీ చివరకు చంద్రబాబు అచ్చెన్నాయుడికే పదవి అప్పగించారు.

మరి అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి అప్పగించి..షో అంతా నారా లోకేషే నడిపించటం అంటే పార్టీ శ్రేణులకు ఏమి సంకేతాలు పంపుతున్నట్లు. అంటే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నా...అచ్చెన్నాయుడు ఉన్నా తాము చెప్పినట్లు ఉండాలనే సంకేతాలు పంపుతున్నారా?. అసలు నారా లోకేష్ ఆకస్మిక పర్యటనల మర్మం ఏమిటనే అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాయకుడు అనే వాడు నిత్యం ప్రజల్లో ఉండటాన్ని ఎవరూ ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఇది అవసరం కూడా. కానీ నారా లోకేష్ ఎంచుకున్న సమయం ఇప్పుడు కీలకంగా మారింది. లోకేష్ సిన్సియర్ గా వరద బాధితులు, బాధిత రైతులను పరామర్శించటమే తన ఉద్దేశం అయితే తన పర్యటనలో అచ్చెన్నాయుడిని కూడా కలుపుకోవచ్చు కదా?. అందులో కొత్తగా అధ్యక్షుడు అయిన వ్యక్తిని అలా వదిలేసి పార్టీ మాదే అని సంకేతాలు ఇవ్వటం రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అంటే పార్టీ నేతల ఆక్రమ కట్టడాలు, కబ్జాలను ప్రభుత్వం కూలగొడుతున్నప్పుడు, తొలగిస్తున్నప్పుడు ప్రకటనలు ఇవ్వటం, ప్రెస్ మీట్లకే పరిమితమా?

Next Story
Share it