Telugu Gateway
Telugugateway Exclusives

గుంపులో గోవింద‌య్య‌..నాకెందుకయ్య‌!

గుంపులో గోవింద‌య్య‌..నాకెందుకయ్య‌!
X

అనుకున్న‌ది ఒక‌టి. అయింది మ‌రొక‌టి. కాంగ్రెలో చేర‌టానికి ప్ర‌శాంత్ కిషోర్ సిద్ధ‌మ‌య్యారు. చేర్చుకోవ‌టానికి కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అయింది. కానీ అక‌స్మాత్తుగా ప్లాన్స్ మారాయి. కాంగ్రెస్ లో చేరి కీల‌క బాధ్య‌త‌లు అంటే..ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేక అంత కంటే పెద్ద ప‌ద‌వి ఏదైనా వ‌స్తుంది ప్ర‌శాంత్ కిషోర్ ఆశించారు. ఆయ‌న ఆశ‌లు..కోరిక‌ల‌కు భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి సాధికార కార్యాచ‌ర‌ణ గ్రూపు (ఈఏజీ) ఏర్పాటు చేసి..అందులోనూ నిర్దేశిత బాధ్య‌త‌లు మాత్ర‌మే అప్ప‌గించాల‌ని ప్ర‌తిపాదించారు. అంటే ఈ కీల‌క‌మైన గ్రూపుకు నాయ‌క‌త్వం వ‌హించే బాధ్య‌త‌ను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌శాంత్ కిషోర్ కు అప్ప‌గించ‌లేదు. దీంతో షాక్ కు గురైన పీకె గుంపులో గోవింద‌య్య నాకెందుక‌య్యా అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాలు తెలిపాయి. అంతే కాదు..కాంగ్రెస్ లో చేరితే ఇత‌ర పార్టీల‌తో ఉన్న ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవాల‌ని ష‌ర‌తు కూడా పీకెకు ఏ మాత్రం రుచించ‌ని అంశం.

ఎందుకంటే ఇది కోట్లాది రూపాయ‌ల వ్య‌వ‌హ‌రం అన్న విష‌యం తెలిసిందే. ఓ వైపు కోరుకున్న ప‌ద‌వి ద‌క్క‌క‌పోగా...వ‌చ్చే వంద‌ల కోట్ల రూపాయ‌ల వ్యాపారాన్ని కాంగ్రెస్ కోసం వ‌దులుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది అని నిర్ణ‌యించుకున్న పీకె..కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చార‌ని చెబుతున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ పార్టీకి ఖ‌చ్చితంగా న‌ష్టం జ‌రిగింద‌నే చెప్పాలి. ఇందులో ప్ర‌శాంత్ కిషోర్ కు పెద్ద‌గా పోయేది ఏమీలేదు. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ న‌ష్టాన్ని ఎలా పూడ్చుకుంటుంది అన్న‌ది వేచిచూడాల్సిందే. కొత్త వ్యూహ‌క‌ర్త‌ల‌ను వెతుక్కుంటుందా...లేక స్వ‌శ‌క్తితోనే ముందుకు సాగుతుందా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it