Telugu Gateway
Telugugateway Exclusives

సినిమా సినిమాకు రాజకీయం మారుస్తున్న చిరు

సినిమా సినిమాకు రాజకీయం మారుస్తున్న చిరు
X

రాజకీయాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి..ఇవ్వకూడదు అన్నది పూర్తిగా చిరంజీవి ఇష్టమే. ఇందులో వేరే వాళ్ళ ప్రమేయం పెద్దగా ఉండదు. కాకపోతే స్వయంగా చిరంజీవే సినిమా సినిమాకు రాజకీయాలపై తన స్టాండ్ మార్చుకుంటున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. . కేవలం తన సినిమాలకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారా లేక ఇందులో మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. చిరంజీవి వ్యవహారం ఇప్పుడు జనసేన వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు అవసరం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లేకపోతే మాత్రం మరోతీరుగా మాట్లాడుతున్నారు. సరిగా మూడు నెలల క్రితం ఇదే చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో అయన మాట్లాడిన మాటలు ఇవి. ' నిజాయతి, నిబద్ధతకు పేరు పవన్ కళ్యాణ్, అలాంటి వాళ్ళు రావాలి. నేను ఒక పక్కన తాను ఒక పక్కన ఉండటం కంటే నేను పక్కకు తప్పుకుని సైలెంట్ అయిపోతే తాను ఎమెర్జ్ అవుతాడు..ఫ్యూచర్ లో మంచి నాయకుడు అవుతాడు. రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇస్తారేమో...రావాలని కూడా కోరుకుంటున్నా. ఎక్కడ కూడా కలుషితం కాలేదు. అలాంటి వాడు రావాలనేది నా ఆకాంక్ష. తప్పనిసరిగా దానికి నా సపోర్ట్ ఉంటుంది.' అని చాలా స్పష్టంగా చెప్పారు.

ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సీజన్ వచ్చింది. మళ్ళీ చిరంజీవి మాట పూర్తిగా మారిపోయింది. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల విషయంలో జోక్యం చేసుకోనని చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ , పవన్ ఫైట్ ను ఒక ప్రేక్షకుడిగా చూడటం తప్ప ఏమి చేయలేను అని కుండబద్దలు కొట్టారు. తాను ప్రజలను అడిగితే నా సినిమాలు చూడండి నన్ను మరింత బిజీ గా ఉంచండి అని అడుగుతాను తప్ప ...మరేమి అడగను అని తెలిపారు. ఒక వేళ పవన్ కళ్యాణ్ అన్నయ్య రా నన్ను చేయిపట్టి నడిపించమంటే ..ఆ అవసరం లేదు అని చెపుతా అని వ్యాఖ్యానించారు. పరుగెత్తే వాళ్ళను వెళ్ళమని చెప్పటం తాము ఏమి చేయలేము అని చిరంజీవి తేల్చేసారు. ఇవి చూస్తే గాడ్ ఫాదర్ సినిమాకు ఒకలాగా..ఇప్పుడు వాల్తేర్ వీరయ్య కు ఒకలాగా చిరంజీవి ప్లేట్ ఫిరాయించారు. మెగా స్టార్ చిరంజీవి ఇది అంతా కావాలని చేస్తున్నారా...లేక గందగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్నారా అన్నది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న.

Next Story
Share it