'ఆత్మ' ను వదిలేసిన కెసీఆర్!
నిన్న మొన్నటి వరకూ కెసీఆర్ బలమే తెలంగాణ. తనకు అంతటి బలాన్ని, రాజకీయశక్తిని ఇచ్చిన తెలంగాణను కాదని..ఇప్పుడు కెసీఆర్ భారత్ వైపు పరుగులు పెట్టడం వెనక మతలబు ఏమిటి?. కెసీఆర్ రెండుసార్లు విజయవంతంగా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారు..రాజకీయంగా ఎవరూ పొందనంత లబ్దిపొందారు. మూడవ సారి తెలంగాణ సెంటిమెంట్ పండే సూచనలు కన్పించటంలేదని..అందుకే ఆత్మలాంటి తెలంగాణను కూడా వదిలేసి ఏకంగా పేరు మార్పునకు నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. తెలంగాణ పేరును కెసీఆర్ పార్టీపరంగా వదిలేశారంటే ఇది ఓ రకంగా ఆయన ఆత్మను వదిలేసినట్లేనని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరు చెప్పుకునే కెసీఆర్ విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. రెండుసార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాలపై కెసీఆర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారో తేలటానికి చాలా సమయం ఉంది కానీ..ఇది ఖచ్చితంగా తెలంగాణలో కెసీఆర్ పై ప్రతికూల ప్రభావం చూపించటం ఖాయం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అన్నింటి కంటే ముఖ్యం ఏమిటంటే నిన్న..మొన్నటివరకూ ఢిల్లీ కి సలామ్ కొట్టాలి..గుజరాత్ గులామ్ లు..పొలిటికల్ టూరిస్టులు అంటూ ఇతర జాతీయ రాజకీయ పార్టీలను విమర్శించిన కెసీఆర్..కెటీఆర్ ఇప్పుడేమి చెబుతారు?.